బంగారు తల్లి డ్రాఫ్ట్‌కు మంత్రివర్గం ఒకె: జానా డుమ్మా

బంగారు తల్లి పథకం ప్రస్తుత రూపం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు. బంగారుతల్లి పథకంలో ఆయన సవరణలను సూచించారు. అయితే, అందుకు మంత్రి వర్గ ఉపసంఘం అంగీకరించలేదు. కాగా, మంత్రులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు. ఈ ముగ్గురు మంత్రులు కూడా హైదరాబాదులో ఉండి మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే, ఢిల్లీలో ఉన్న మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. సభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులను రెండు రోజుల పాటు శానససభ నుంచి స్పీకర్ నాదెండ్ల మనోహర్ సస్పెండ్ చేశారు. దీంతో బంగారుతల్లి పథకాన్ని ప్రతిపాదించే సమయంలో ఈ పార్టీల సభ్యులు సభలో ఉండరు.
కాగా, వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బంగారు తల్లి పథకం కాంగ్రెసు పార్టీని గెలిపిస్తాయని కిరణ్ కుమార్ రెడ్డి నమ్ముతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ఇప్పటికే చట్టబద్ధత కల్పించినందున బంగారు తల్లి పథకానికి కూడా చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారు. కాగా, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కావూరి సాంబశివరావును, జెడి శీలంను ముఖ్యమంత్రి అభినందించారు.












Click it and Unblock the Notifications