సభ నుండి బిజెపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: సభలో ప్రజా సమస్యలు చర్చించకుండా అడ్డుపడుతున్నారని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు చెందిన శాసన సభ్యులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బిజెపి శాసన సభ్యులు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ పార్టీల ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో అన్ని అంశాలపై చర్చిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
బిజెపి ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ, నాగం జనార్ధన్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, భిక్షపతి, కొప్పుల ఈశ్వర్, గంపా గోవర్ధన్, జూపల్లి కృష్ణా రావు, నల్లాల ఓదేలు రాజయ్య, జోగు రామన్న, చెన్నమనేని రమేష్, రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, వినయ భాస్కర్ తదితరులను సస్పెండ్ చేశారు.

గత సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాటి నుండి తెరాస, బిజెపి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకుంటున్నారు. తెలంగాణపై తీర్మానం పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుపడుతున్నారంటూ వారిని సస్పెండ్ చేసింది. సస్పెండైన బిజెపి, తెరాస ఎమ్మెల్యేలు సభ నుండి వెళ్లిపోవాలని స్పీకర్ కోరారు.
శాసనమండలిలో...
ఎమ్మెల్సీలకు తెలియకుండా స్థాయి సంఘాల నివేదికలు ప్రవేశ పెట్టడంపై శాసనమండలి చైర్మన్ చక్రపాణి క్షమాపణలు తెలిపారు. శాసనమండలి సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన కొద్ది సేపటికే తమకు సమాచారం ఇవ్వకుండా స్థాయి సంఘాల నివేదికలు ప్రవేశ పెట్టారని ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications