కొత్తగా కావూరి, జెడి శీలంలకు ఎందుకీ ప్రాధాన్యం?

కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రాధాన్యం ఇస్తూ అదే వర్గానికి చెందిన కావూరి సాంబశివ రావును విస్మరిస్తున్నారనే అభిప్రాయం బలడింది. అయితే, కావూరి సాంబశివ రావును కేబినెట్ మంత్రిగా మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా ఆ అభిప్రాయం నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి సహాయ మంత్రి హోదానే కల్పించిన కాంగ్రెసు అధిష్టానం కావూరిని మంత్రివర్గం ఏకంగా కేబినెట్ హోదా మంత్రిగా తీసుకోవాలని నిర్ణయించింది.
కావూరి సాంబశివరావు ఏలూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తలపండిన వ్యక్తిగా పేరు గడించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కావూరి సాంబశివ రావును దూరం చేసుకోవడం మంచిది కాదనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు.
జెడి శీలం దళిత క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు దళిత క్రైస్తవులు వెళ్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెసు అధిష్టానం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ వర్గానికి చెందిన శీలంకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత క్రైస్తవులను పార్టీ వైపు తిరిగి రాబట్టడంలో జెడి శీలంకు మంత్రి పదవి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి చెందినవారు 12 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర నుంచి కావూరి సాంబశివ రావుకు కేబినెట్ హోదా కల్పించిట్లు చెబుతున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, చిరంజీవిలను సహాయ మంత్రులుగా స్వతంత్ర హోదా కల్పించారు.












Click it and Unblock the Notifications