వరదలు: టిడిపి ప్రత్యేక విమానం, బాబు బిజీ బిజీ
హైదరాబాద్/రాజమండ్రి: ఉత్తరాఖండ్ తెలుగు యాత్రికులను హైదరాబాదుకు తీసుకు వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు 190 మందికి పైగా యాత్రికులతో ప్రత్యేక విమానం ఢిల్లీ నుండి హైదరాబాదుకు బయలుదేరనున్నట్లు టిడిపి ప్రకటించింది.
హైదరాబాదు నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వరద బాధితుల సహాయం కోసం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఢిల్లీ నుండి హైదరాబాదుకు వచ్చే విమానంలో హైదరాబాదు, విశాఖపట్నం, గుడివాడ, విజయవాడ, కర్నూలు, మంత్రాలయం, గుంటూరు, వరంగల్, గుంతకల్లు, చీపురుపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల వారు వస్తున్నారు. మంగళ, బుధవారాలు కూడా విమాన సర్వీసును నడిపే ప్రయత్నాలు చేస్తామన్నారు.

ఉత్తరాఖండ్ సిఎంతో చంద్రబాబు భేటీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో భేటీ అయ్యారు. వరదలో చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడాలని చంద్రబాబు ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేశారు.
చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ఈ రోజు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంపించే వైద్య సహాయం ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు జిల్లా నాయకులకు ఫోన్ చేసి యాత్రికులు జిల్లాలకు చేరుకోగానే పార్టీ పరంగా వారిని ఆదుకోవాలని కోరారు. టిడిపి ఆయా జిల్లాల అధ్యక్షులకు చంద్రబాబు ఫోన్ చేశారు. చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి ఎపి భవన్‌లో ఆందోళన చేశారు. ఈ రోజు డెహ్రాడూన్ వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఎపిలో నేతలకు ఆదేశాలు పంపించారు.












Click it and Unblock the Notifications