హస్తినలో కిరణ్ రెడ్డి బిజీ: తెలంగాణపై తేల్చేస్తారా?
న్యూఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఆయన కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించడానికి ముందు మాట్లాడేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. తెలంగాణపై మాట్లాడేందుకు మాత్రమే ఆయన ఢిల్లీలో ఉన్నట్లు చెబుతున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం సమావేశమైన వారి మధ్య ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన దిగ్విజయ్ సింగ్‌తో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణపై కొద్ది రోజుల్లోనే కేంద్రం ప్రకటన చేస్తుందని అంటున్నారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం మూడు ప్రతిపాదనలపై ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణ ప్రాంతాన్ని యథాతథంగా రాష్ట్రంగా ప్రకటించడం, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు పూనుకోవడం అనే మూడు ప్రతిపాదనలపై కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ప్యాకేజీల ప్రతిపాదన లేదు
తెలంగాణను అడ్డుకోవడానికే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన అని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కాంగ్రెసు మాజీ నాయకుడు కె. కేశవరావు విమర్శించారు. అయితే, కేశవరావు మాటలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి రాలేదని ఆయన అన్నారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణకు సానుకూలంగా త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ప్యాకేజీల ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు.
దిగ్విజయ్ సింగ్‌తో చిరంజీవి భేటీ
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాల నాయకుల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. సమైక్యంగానే రాష్ట్రాన్ని ఉంచాలని రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ అన్నారు. అయితే తెలంగాణ సమస్యను త్వరగా తేల్చాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని వాదిస్తున్న సీమాంధ్ర నేతలు కూడా సమస్యను మాత్రం నాన్చకూడదనే బలమైన అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు వ్యవహరిస్తానని చెబుతున్నప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా అధిష్టానాన్ని ప్రభావితం చేస్తున్నారని తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఈ మేరకు పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మంగళవారంనాడు రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను దిగ్విజయ్ సింగ్‌ను కలిసినట్లు చిరంజీవి చెబుతున్నారు. కానీ, తెలంగాణపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని మరో రాయలసీమ మంత్రి రఘువీరా రెడ్డి నెల్లూరులో అన్నారు. విభజనవాదం వల్ల అభివృద్ధికి అవరోధం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అంటున్నారు. ఇదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు డాక్టర్ ఎంవి మైసురా రెడ్డి మంగళవారం మరోసారి చెప్పారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీమాంధ్రకు చెందిన మంత్రి పార్థసారథి అన్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన వల్ల సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి హెచ్చరిక
అయితే, తెలంగాణ విషయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు మరోసారి హెచ్చరికలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ అంగీకరించబోమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని ఆంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ నాయకులు కోరుతున్న నేపథ్యంలో వారు ఆ మాట అన్నారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించబోమని అన్నారు.
మొత్తం మీద, మరోసారి తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానంలో కదలిక వచ్చినట్లు ముమ్మరంగా ప్రచారం మాత్రం జరుగుతోంది. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం ప్రకటించే వరకు నమ్మకం లేదనేదే గట్టి అభిప్రాయం. తెలంగాణపై ఎప్పటికప్పుడు ముందుకు వచ్చినట్లే వచ్చి అంతే వేగంగా వెనక్కి తగ్గుతోంది. ఈ స్థితిలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదనేది నమ్మలేని విషయంగానే ఉందని అత్యధికుల అభిప్రాయం.
డిఎస్‌కు అసలు విషయం తెలుసా..
అయితే, తెలంగాణకు చెందిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశలోనే ఈ చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే, డిఎస్ చర్చల సందర్భంలో తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించి, చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కూడా అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారు. జానారెడ్డి వంటి సీనియర్ మంత్రులు, నాయకులతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు సమావేశమయ్యారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఏం చేయదల్చిందీ డి. శ్రీనివాస్‌కు, దామోదర రాజనర్సింహకు తెలుసునని భావిస్తున్నారు.
ఏమైనా, సార్వత్రిక ఎన్నికల లోపల తెలంగాణ అంశాన్ని తేల్చడానికే కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరే ప్రత్యామ్నాయాన్ని కూడా అంగీకరించేది లేదని తెలంగాణ నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై ఏ ప్రకటన వెలువడుతుందనేది ఆసక్తికరంగానే ఉంది.












Click it and Unblock the Notifications