జలగం వెంకటరావు ఇష్యూలో జగన్ తప్పు చేశారా?

జిల్లాలో జలగం వెంకటరావుకు సముచిత స్థానం కల్పిస్తానని జగన్ మాట ఇచ్చారని అంటారు. కానీ ఆ తర్వాత ఆయన ఆ మాట నిలబెట్టుకోలేదని చెబుతున్నారు. దీనివల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకోవాలని జలగం వెంకటరావు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జలగం వెంకటరావుకు జగన్ ఇచ్చిన హామీ ఏమిటనేది తెలియదు. జగన్ ఆయనకు ఖమ్మం అసెంబ్లీ సీటు ఇస్తానని చెప్పారా, పార్లమెంటు సీటు ఇస్తానని హామీ ఇచ్చారా అనేది తెలియదు.
2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో జలగం వెంకటరావు ఖమ్మం నియోజకవర్గ కోరుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ సీటు ఇస్తానని అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతారు. కానీ రేణుకాచౌదరితో ఉన్న విభేదాల కారణంగా ఆయనకు చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగి కొద్దితేడాతో ఓటమి చెందారు.
భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జలగం వెంకటరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన బలం ఆ సభ ద్వారా తెలిసి వచ్చినప్పటికీ జగన్ అలా ఎందుకు వ్యవహరించారనేది తెలియడం లేదు. నిజానికి, జలగం వెంకట్రావు రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సత్తుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
కాగా, జలగం వెంకటరావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, వెంకట్రావు ముఖ్యమంత్రి కిరణ్‌ని ఈనెల 22వ తేదీన కలిశారనే ప్రచారం ఊపందుకున్నది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు రావడంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి జలగం వెంకటరావును పార్టీలోకి తిరిగి తేవాలనే ఆలోచనతో పావులు కదుపు తున్నట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications