ఢిల్లీలోనే సిఎం, బొత్స: తెలంగాణపై అవునా, కాదా?
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం ఇంకా హస్తినలో నలుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారంనాడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనతో ప్రధానంగా తెలంగాణపైనే చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తలను ఎవరూ ధ్రువీకరించడం లేదు. పైగా, అటువంటి చర్చలేమీ లేవని అంటున్నారు. తాను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణపై చర్చలు చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి చెప్పగా, తనతో తెలంగాణపై ఎవరూ మాట్లాడలేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు.
నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో, కేంద్ర మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. బుధవారం రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీని కలిసేందుకు ఆయన నిరీక్షిస్తున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల వరకు కూడా ఆయన సోనియాను కలుసుకోలేదు. బుధవారం రాత్రి కూడా ఆయన ఢిల్లీలో ఉంటారని తెలుస్తోంది.

కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం ఢిల్లీ వచ్చారు. తెలంగాణపై చర్చల్లో భాగంగానే ఆయన ఢిల్లీ వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన బుధవారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా ఢిల్లీ వచ్చారు. తెలంగాణపై తేల్చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నాయకులు కూడా సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూనే వారు ఆ విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, తెలంగాణకు ప్యాకేజీ ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెసు నాయకులంతా తోసిపుచ్చుతున్నారు. ప్యాకేజీ ఆలోచన లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపి మధుయాష్కీ వంటి ముఖ్యమైన నాయకులు కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి రాష్ట్ర విభజనకే కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే, యథాతథ తెలంగాణ కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. అది ఆలోచన మాత్రమేనని మధు యాష్కీ కూడా అన్నారు. రాయల తెలంగాణ అనేది ఊహాజనితమేనని మంత్రి జానా రెడ్డి అన్నారు.
రాయల తెలంగాణకు సీమాంధ్ర నాయకుల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. సీమాంధ్ర నాయకులు చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, రాయల తెలంగాణ మెలిక పెట్టి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను అటకెక్కించాలనే ప్రయత్నాలు కాంగ్రెసు అధిష్టానం చేస్తోందని బిజెపి వంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే, తనను కలిసిన తెలంగాణ నాయకులతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నట్లు చెబుతున్నారు.
ఇక, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఈ నెల 30వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను తలపెట్టారు. ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన నాయకులు ఈ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటూ వస్తున్న నాయకులు కూడా సభ కోసం పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి ముందుండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నాయకులు కూడా కొంత మంది ఈ సభకు సహకరిస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో భాగంగానే తెలంగాణ నాయకులు ఈి సభను నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications