కావూరిపై భగ్గుమన్న సమైక్యాంధ్ర జెఏసి, నేతల్లో టెన్షన్

తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన కావూరి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని సమైక్యాంధ్ర జెఏసి హెచ్చరించింది. లేదంటే ఆయనను తాము సీమాంధ్రలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని తెలిపింది. కావూరి సాంబశివ రావు వ్యాఖ్యల పైన రాజకీయవర్గాల్లోను ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు ఉత్కంఠగా ఉన్నారు.
కాగా, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందన్న నేపథ్యంలో సమైక్యాంధ్ర జెఏసి ఈ రోజు సమావేశం కానుంది. రేపటి నుండి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టనుంది. జూలై 3న ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. జూలై తొలి వారంలో ఎయులో భారీ బహిరంగ సభ, 15న రథయాత్ర చేయనున్నారు. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా భేటీ కానున్నారు.
కేంద్రం తెలంగాణనపై అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అది సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ అన్నారు. తెలంగాణపై కేంద్రానికి, అధిష్టానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. ఒత్తిడి తెచ్చింది తామేనన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి, గవర్నర్‌లు కేంద్రానికి చెప్పారన్నారు.
తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విద్యాసాగర రావు అన్నారు. ఈ నెల 30వ తేదిన రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను సభకు ఆహ్వానించి స్పష్టమైన ప్రకటన చేయించాలని సవాల్ చేశారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందనే నమ్మకముందని శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. కావూరి సాంబశివ రావు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారంతా మానసికంగా ఒక్కటిగానే ఉంటారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ న్యాయంగా అయితే ఓ నిర్ణయం ప్రకటించిందని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. ఎవరు ద్వేషాలు పెంచుకోవద్దన్నారు. కావూరి నిర్ణయం ఆహ్వానించదగ్గదన్నారు. ప్యాకేజీలు, రాయల తెలంగాణ వద్దని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.












Click it and Unblock the Notifications