కావూరి తెలంగానం: చిరు పట్టు, జగన్ రాజీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. నేతల వ్యాఖ్యలను బట్టి ఆ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నుండి ఓ ప్రకటన వెలువడే అవకాశముంది. కాంగ్రెసు పార్టీ ప్రకటనే కేంద్రం నుండి వచ్చే ప్రకటనగా భావించవచ్చు. పలువురు కాంగ్రెసు మంత్రులు చెప్పినట్లుగా సాధారణ ఎన్నికలు ఆరు నెలల ముందు తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఓ నిర్ణయాన్ని, అదీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలవడే అవకాశాలున్నాయి.
ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి మూడున్నరేళ్లు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో సెంటిమెంట్ ప్రజల్లో మరింత ఎక్కువయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. అయితే ఈ ఉద్యమ కాలంలో పలువురు ముఖ్య నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్న వారున్నారు, సైలెంట్ అయిన వారు మరికొందరున్నారు.
తెలంగాణకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వ్యతిరేకంగా ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఉన్నారట. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు వ్యాఖ్యల ద్వారా తెలంగాణ వస్తుందనే ధీమా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో మరింత బలపడింది. అదే సమయంలో సీమాంధ్ర నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే ఇది స్థానిక లేదా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే జిమ్మిక్కులో భాగమనే వారు లేకపోలేదు. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం ఎలా ఉన్నా పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

తెలంగాణ విషయంలో మాటమార్చిన వారిలో కేంద్రమంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు పేరును ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డారు. అయితే కేంద్రమంత్రి అయ్యాక ఆయన మాటలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పదవులు రాకముందు అతను తెలంగాణ కాంగ్రెసు నేతలు పదవుల కోసమే రాజీనామాలు, తెలంగాణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఘాటుగా మాట్లాడారు. అదే కావూరి ఇప్పుడు మంత్రి పదవి వచ్చాక మాట మార్చారని సమైక్యవాదులు మండిపడుతున్నారు. జీవితంలో ఎన్నో విషయాల్లో రాజీపడుతుంటామని కావూరి శుక్రవారం అన్నారు. అయితే పదవి కారణంగానే ఆయన ఇలా వైఖరిని మార్చుకున్నారని సమైక్యవాదులు మండిపడుతున్నారు.

వియవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తెలంగాణపై పెద్దగా స్పందించనట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే ప్రచారం జరిగినా, తెలంగాణ నేతలు మాట్లాడినా వెంటనే స్పందించడంలో లగడపాటి ముందుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ ఆయన స్పందన నామమాత్రమేనే ఉందంటున్నారు.

సమైక్యాంధ్రకు గొంతు కలిపే నేతల్లో గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా ఉంటారు. ఇటీవల ఆయన తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మరో ముఖ్యనేత జెసి దివాకర్ రెడ్డిదీ అదే మాట. గాదె వెంకట రెడ్డి సమైక్యంపై మెట్టు దిగినట్లుగా కనిపించడం లేదు.

పార్టీలకతీతంగా విజయవాడ నేతలంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారు. గతంలో తెలంగాణపై ప్రకటన వచ్చినప్పుడు ఈ జిల్లా నేతలు కూడా రాజీనామా చేయడంలో ముందు నిలిచారు. మల్లాది విష్ణు వంటి నేతలు సమైక్యాంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరినప్పటి నుండి అధిష్టానం మాటే మా మాట అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు సమైక్యవాదం వినిపించిన చిరంజీవి... ఇప్పుడు ఆ భారాన్ని అధిష్టానంపై వేశారు. అయితే మంత్రులు గంటా శ్రీనివాస రావు వంటి నేతలే మాత్రం సమైక్యాంధ్రపై తగ్గటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల విషయంలో తెలంగాణపై మార్పు రాలేదనే చెప్పవచ్చు. చిరులాగే వీరిద్దరు అధిష్టానం పైనే భారం వేశారు. అయితే వ్యక్తిగత విషయానికి వస్తే కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా, బొత్స కొంత అనుకూలంగా కనిపిస్తారనే వాదన ఉంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించినప్పటికీ తెలంగాణవాదులు దానిని మర్చిపోలేకపోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని ఇప్పుడు ఆ పార్టీ చెబుతోంది. అయితే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం వారు పదే పదే పార్లమెంటులో ప్లకార్డును తెరపైకి తీసుకు వస్తున్నారు. అయితే సమైక్యవాదిగా ముద్రపడిన జగన్ కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని రాజీపడ్డారనే చెప్పవచ్చు.

2009 డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తే దానిని చంద్రబాబు అడ్డుకున్నారనేది కొందరు తెలంగాణవాదుల వాదన. తాము తెలంగాణకు గత తీర్మానానికి కట్టుబడి ఉన్నామనే టిడిపి వాదన. గతేడాది డిసెంబర్ 28న జరిగిన అఖిల పక్ష సమావేశంలోను తాము గత తీర్మానానికి కట్టుబడి ఉన్నామని టిడిపి చెప్పింది. తీర్మానంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇరు ప్రాంతాల్లో పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణపై నిర్ణయం కేంద్రందేనని, తమ అభిప్రాయం చెప్పామని చంద్రబాబు చెబుతున్నారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మొదట సమైక్యవాదిగా ముద్రపడ్డారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఆయన తెలంగాణకు అనుకూలంగా మారారు. రాజకీయ విభేదాలు కూడా ఆయన మార్పుకు కారణమనే వారున్నారు.












Click it and Unblock the Notifications