సోనియా గాంధీ ప్లాన్: కెసిఆర్ 'చే'జారకుండా కెకె?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేజారకుండా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని బేషరతుగా కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ కాంగ్రెసు పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. అయితే, తెలంగాణకు చెందిన కొంత మంది సీనియర్ కాంగ్రెసు నాయకులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇస్తే తెరాసను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, సొంతంగానే తాము తెలంగాణ అత్యధిక పార్లమెంటు సాధించి పెడుతామని హామీ ఇచ్చినట్లు చెబుతన్నారు.
తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ వంటి నేతలు తెరాస విలీనం ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు సమాచారం. తెరాసను విలీనం చేస్తే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ కెసిఆర్ ఆధిపత్యంలోకి వెళ్తుందని వారు ఆందోళన చెందినట్లు చెబుతున్నారు. దీంతో విలీనం ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం పెద్దలు వెనక్కి నెట్టినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కెసిఆర్ తమకు అనుకూలంగా వ్యవహరించేలా చూసుకోవాలని సోనియా గాంధీ భావించినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై, తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో కాంగ్రెసు అధిష్టానం పెద్దలు పెద్ద కసరత్తే చేసినట్లు చెబుతున్నారు. అయితే, అవరమైతే కెసిఆర్ సహాయం తీసుకోవడానికి వీలుగానే తమ పార్టీ సీనియర్ నేత కేశవరావును తెరాసలోకి పంపినట్లు ప్రచారం సాగుతోంది. సోనియా గాంధీతో సమావేశమైన తర్వాతనే కేశవ రావు ఇద్దరు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, వివేక్‌లతో తెరాసలో చేరారు. అయితే, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేకపోవడంతో తాను తెరాసలో చేరినట్లు కేశవరావు చెబుతూ వస్తున్నారు.
కానీ, సోనియా గాంధీతో కుదిరిన అవగాహన మేరకే కేశవరావు తెరాసలో చేరారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ తెరాసతో పొత్తు కాంగ్రెసుకు పొత్తు కుదర్చే విషయంలో కేశవ రావు కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్న ఇతర తెలంగాణ నాయకుల వాదనకు అనుగుణంగా వ్యవహరిస్తూనే కెసిఆర్ తమ చేజారిపోకుండా కాంగ్రెసు అధిష్టానం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం ప్రకటించడానికి సిద్ధపడినట్లు బలమైన సంకేతాలే అందుతాయి. తెలంగాణ ఏర్పడితే తెరాస, కాంగ్రెసు కలిసి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఓడించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేశవరావు కీలకమైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. కెసిఆర్‌ను కట్టడి చేయడానికి కెకె పనికి వస్తారని కాంగ్రెసు అధిష్టానం నమ్ముతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications