కాంగ్రెసు తెలంగాణ సభ ఒక్కటై: డైరెక్షన్ ఎవరిది?
హైదరాబాద్: అనూహ్యంగా గ్రూపులు విడనాడి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. రేపు ఆదివారం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విచిత్రంగా తెలంగాణపై అంతగా గళం విప్పని నాయకులు కూడా ఈ సభకు ముందుండి పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులైన మంత్రులు, శానససభ్యులు కూడా ఈ సభపై ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా విజయం చేయడానికి పనులు చేస్తున్నారు.
తెలంగాణ నాయకులంతా అంతర్గత విభేదాలు, విధేయతలు విడనాడి తెలంగాణ కోసం ఒకే వేదిక మీదికి రావడం ఆశ్చర్యకరంగానే ఉంది. ఈ స్థితిలో పార్టీ అధిష్టానం దర్శకత్వంలోనే ఈ సభ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ మాటలను తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి ఖండిస్తున్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేననే నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కె. జానారెడ్డి మొత్తానికి ముందుండి ఈ సభను నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులంతా ఈ సభకు హాజరు కావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈ సభకు తాను హాజరవుతానని చెప్పారు. సభకు తరలి రావాలని శానససభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. తెలంగాణ కార్యాచరణకు సురేష్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇలా దూరంగా ఉంటూ వస్తున్న సురేష్ రెడ్డివంటి నాయకులు కూడా సభ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలమో, వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు. హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అని, హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర కావాలని ఆయన అంటున్నారు. దీన్నిబట్టి పైస్థాయిలోని నాయకుల ప్రోత్సాహం ఈ సభకు ఉండడం వల్లనే ఇలా కలిసి పనిచేసేందుకు తెలంగాణ నాయకులంతా ఒక్కతాటి మీదికి వచ్చినట్లు చెబుతున్నారు.
కాగా, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెలంగాణ నాయకులకు సభ విషయంలో జాగ్రత్తులు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సభను విజయవంతం చేయాలని, లేదంటే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసుకు ఈ ప్రాంతంలో ప్రయోజనం ఉండదనే సంకేతాలు అధిష్టానానికి వెళ్తాయని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం ఈ సభను ప్రాతిపదికగా చూపే అవకాశాలున్నాయని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రాబల్యాన్ని తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బిజెపి బలం పుంజుకుంటున్న తరుణంలో తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి కూడా ఈ సభను ఉద్దేశించినట్లు చెబుతున్నారు. బహిరంగ సభలో తెలంగాణ తీర్మానం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు.
కాగా, సభా సమయంలో నాయకుల మధ్య పొరపొచ్చాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 110 మంది కూర్చోవడానికి వీలుగా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పది మంది ప్రసంగాలు మాత్రమే సంక్షిప్తంగా ఉండేలా చూసుకుంటున్నారు. వేదికపై రాష్ట్ర నాయకుల చిత్రాలు లేకుండా చూస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ బొమ్మలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎప్పుడో ఇటువంటి సభ పెట్టాల్సింది: సర్వే
కాగా, తాము సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, నాయకులే రాజకీయం చేస్తున్నారని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులను ప్రాణాలు అడ్డుపెట్టి ఆదుకుంటామని ఆయన చెప్పారు. కొంత మంది నేతలే తెలంగాణను అడ్డుకుంటున్నారని, సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న బహిరంగ సభను ఎప్పుడో పెట్టాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఎసి ఉచ్చులో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చిక్కుకున్నారని ఆయన అన్నారు 3,4 సీట్లు సాధించే పార్టీలతో తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెరాసలో చేరిన ఎంపీలు ఏం సాధిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications