మాజీ ప్రేయసి భర్తను విద్యార్థి చంపి పాతిపెట్టాడు

ఆ హత్య ఎనిమిది రోజుల క్రితం చోటు చేసున్నప్పటికీ శుక్రవారం వెలుగు చూసింది. ఉపాధ్యాయుడి అదృశ్యం కేసును ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆ సంఘటన బయటపడింది. నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కాలేజీలో బిఎస్సీ ఫైనల్ చదువుతున్న 20 ఏళ్ల సూర్యతేజ జూన్ 22వ తేదీన ద్యాల నవీన్ కుమార్ అనే ఉపాధ్యాయుడిని హత్య చేసి శవాన్ని మిట్టాపూర్ శివారులో పాతిపెట్టాడు.
ఆదిలాబాద్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో గల మన్మాడ్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవీన్ కుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ మండలం బాసర. అతను జూన్ 2వ తేదీన నిజామాబాద్‌లోని సరితను వివాహం చేసుకున్నాడు. తన క్లాస్‌మేట్ సూర్యతేజతో ప్రేమ వ్యవహారం ఉండడంతో సరిత వివాహం పట్ల అసంతృప్తితో ఉంది. పరీక్షల సాకుతో సరిత జూన్ 20వ తేదీన తన తల్లిగారింటికి వచ్చింది. సూర్యతేజను, తన కజిన్ నిఖీల్‌ను కళాశాలలో కలిసింది. వారి ముందు ఆమె ఏడ్చింది.
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యతేజ నిఖిల్‌తో కలిసి నవీన్ కుమార్ హత్యకు పథకం వేశాడు. వారు మరో మిత్రుడు నాయర్ సహాయం తీసుకున్నారు. హత్య చేయడానికి ముందు రోజు శవాన్ని పాతిపెట్టడానికి బొంద కూడా తవ్వారు. జూన్ 22వ తేదీన కారును అద్దెకు తీసుకుని ముథోల్ వెళ్లారు. నిఖిల్ నవీన్ కుమార్‌కు తన మొబైల్ ద్వారా కాల్ చేశాడు. తాము పని మీద ముథోల్ వచ్చామని, కలవడానికి ఎదురు చూస్తున్నామని నిఖిల్ నవీన్ కుమార్‌తో చెప్పాడు.
నవీన్ కుమార్‌ను వారు కారులో ఎక్కించుకున్నారు. అతను ముందు సీట్లో కూర్చుండగా, సూర్యతేజ కారు నడుపుతున్నాడు. నిఖిల్, నాయర్ వెనక సీట్లో కూర్చున్నారు. కారు బిద్రెల్లి సమీపానికి వచ్చిన సమయంలో వెనక నుంచి నవీన్ కుమార్ తలపై ఇనుప రాడ్‌తో కొట్టారు. ఆ తర్వాత వైర్‌తో అతనికి ఉరి వేశారు. శవాన్ని మిట్టాపూర్ తీసుకుని వెళ్లి ముందే తవ్వి ఉంచిన బొందలో పాతిపెట్టారు.
నవీన్ ఫోన్ డాటా రికార్డులను పరిశీలించిన ముథోల్ పోలీసులు హత్య కేసు మిస్టరీని ఛేదించారు. నిఖిల్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో నిఖిల్, సూర్యతేజ నేరాన్ని అంగీకరించారు.












Click it and Unblock the Notifications