బైక్ నడుపుతూ దామోదర, పాదయాత్రగా కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నేతలు నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర సాధనా సభ ఆదివారం మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాల నుండి భారీగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.
కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు ఆయా ప్రాంతాల నుండి ర్యాలీగా తరలి వస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం నుండి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భారీ బైక్ ర్యాలీతో వస్తున్నారు. దామోదర స్వయంగా బైక్ నడుపుతూ వస్తున్నారు. గన్ పార్క్ నుండి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, నల్గొండ జిల్లా నేతలు కోమటిరెడ్డి సోదరులు పాదయాత్రతో వస్తున్నారు. పలువురు పీపుల్స్ ప్లాజా నుండి పాదయాత్రగా వస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎన్నికలు, తెలంగాణ సాధనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. తెలంగాణ కోసం పార్టీ కార్యకర్తలందరూ సంఘటితంగా కృషి చేయాలని కోరారు.
మరో పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల తీరు వల్లే తెలంగాణ ఆగిపోయిందన్నారు. గతంలో ఇచ్చిన తెలంగాణ హామీ నెరవేరుస్తేనే ఈ ప్రాంతంలో తెలంగాణకు బలం పెరుగుతుందని, ప్యాకేజీలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలన్నారు.
ఢిల్లీ నేతలకు చెప్పేందుకే: దామోదర
ఢిల్లీ నేతలకు తెలంగాణ ఆకాంక్షను తెలియజేసేందుకే తాము తెలంగాణ సాధన సభను నిర్వహిస్తున్నామని దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఓట్లు, సీట్ల కోసం కాదు: యాష్కీ
తాము ఓట్లు, సీట్ల కోసం ఈ సభను నిర్వహించడం లేదని తెలంగాణ సాధన కోసమే నిర్వహిస్తున్నామని మధుయాష్కీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమన్నారు.
కాగా, నిజాం హాస్టల్ వద్ద ఓ యువకుడిని పోలీసు వాహనం ఢీకొంది.












Click it and Unblock the Notifications