సమైక్యం కోసం కెవిపి ఇంట్లో భేటీ, లగడపాటి హాజరు

సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి రాష్ట్ర విభజన సమర్ధనీయం కాదని వినతి పత్రం ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వినతి పత్రం ఎలా ఉండాలన్న విషయమై వారు వివరంగా చర్చించుకున్నారు. జల వివాదాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలనూ వారు తమ నివేదికలో పొందుపరచారని సమాచారం. జూలై 2వ తేదీ తర్వాతే విభజన అంశంపై తాను స్పందిస్తానని లగడపాటి చెప్పారు.
దిగ్విజయ్ రాకతో సమైక్యవాదం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర విభజనకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తొలిసారి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నం వచ్చారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, పార్టీ సీనియర్ నాయకుడు గాదె వెంకట రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఓ వైపు ఎంపీలు సమావేశం కాగా, దిగ్విజయ్ రాకకు ముందు మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించాలని నిర్ణయించారు. సమైక్యాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరఫున దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన మంత్రి శైలజానాథ్ ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కోరుతున్న తెరాసకు అసలు హైదరాబాద్‌లోనే పట్టు ఏమాత్రం లేదని తన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications