జగన్ కోపం తగ్గలేదా?: వైయస్ వివేకాకు లేని బాధ్యత!

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టిన వెంటనే వివేకా ఆయన వెంట వెళ్లలేదు. అంతేకాదు ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవిని కూడా ఇచ్చింది. కడపలో వైయస్ జగన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వివేకా వల్లనే సాధ్యమవుతుందని భావించడం వల్ల అధిష్టానం ఆయనను ప్రోత్సహించింది.
పలు పదవుల కోసం వివేకా సైతం ఢిల్లీ వెళ్లి రాయబారాలు నెరపినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఆయన ఎక్కడా జగన్‌ను తప్పపట్టనప్పటికీ, తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీకి లాయల్‌గా ఉన్నారని, తాను ఆయన దారిలోనే నడుస్తానని పలుమార్లు చెప్పారు.
కాంగ్రెసు పార్టీని వీడిన జగన్ ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయమ్మ పులివెందుల శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు అధిష్టానం విజయమ్మ పైన వైయస్ వివేకాను బరిలో నిలిపింది. అంతేకాకుండా తన అల్లుడిని జగన్ పైన పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది జగన్‌కు మరింత ఆగ్రహం తెప్పించిందంటారు.
అయితే తాము ఊహించినట్లుగా ఉప ఎన్నికలలో వైయస్ వివేకా ప్రభావం కనిపించక పోవడంతో ఆయనకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించడమే కాకుండా, వైయస్ పేరును సిబిఐ ఛార్జీషీటులో పెట్టడంతో ఆయన క్రమంగా కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. తన సోదరుడి పేరును ఛార్జీషీటులో పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పి మరీ వివేకా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
అయితే వివేకా పార్టీలో చేరినప్పటికీ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదన గతంలో వినిపించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధికారికంగా ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదు. దీంతో తాను బయటకు వచ్చినా వెంట రాకపోవడం, తల్లి పైనే పోటీ చేయడం వంటి అంశాలను ఇంకా మర్చిపోని జగన్ ఆయనను పక్కన పెడుతున్నారా? అనే చర్చ సాగుతోంది.
అయితే పార్టీలో వైయస్ వివేకాకు ఎలాంటి పదవి లేదనే అంశం పెద్ద విషయం కాదనే వారు కూడా ఉన్నారు. స్వయంగా జగన్ సోదరి షర్మిల పార్టీ కోసం ఇంతగా కష్టపడుతూ పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఎలాంటి పదవి లేదని చెప్పే వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications