తెలంగాణ: ముగ్గురితో నేడు భేటీ, సోనియా ఆలోచన?
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచన ఏమిటనేది తెలియడం లేదు. కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం తర్వాత స్పష్టమైన ప్రకటన రాదని భావించినప్పటికీ సంకేతాలు మాత్రం అందుతాయని భావించారు. కానీ, అటువంటి సంకేతాలు కూడా ఏమీ అందలేదు. సోనియా గాంధీ అటో ఇటో తేల్చేయడానికే సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు సోనియా గాంధీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో సమావేశం కానున్నారు.
రేపటి సమావేశంలో సోనియా గాంధీ ఆ ముగ్గురికి ఏవైనా సంకేతాలు, సూచనలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, వారు ముగ్గురు కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశం కానున్నారు. కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ముగ్గురు రాష్ట్ర నాయకులకు కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సూచించారు.

కాగా, కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితిని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కోర్ కమిటీకి వినిపించానని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా కోరానని, దీనిపై 22 నిముషాలపాటు ప్రెజెంటేషన్ ఇచ్చానని అన్నారు. త్వరలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని అనుకుంటే విషయం సిడబ్ల్యుసి దాకా వెళ్లేది కాదని అంటున్నారు సిడబ్ల్యుసిలో చర్చించాలని నిర్ణయం తీసుకోవడంలోనే రాష్ట్ర విభజనకు పూనుకోవాలనే ఉద్దేశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కాంగ్రెసు తీరు పట్ల తెలంగాణవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
సిడబ్ల్యుసి సమావేశం తర్వాత యుపిఎ సమావేశం అంటారని, ఆ తర్వాత ప్రతిపక్షాలతో సమావేశమని అంటారని, ఇలా తెలంగాణపై కాలయాపన చేసే వ్యూహాన్ని మాత్రమే కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తోందని విమర్సిస్తున్నారు. మొత్తం మీద, తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని భావించినవారందరికీ అసంతృప్తే మిగిలింది.












Click it and Unblock the Notifications