
తెలంగాణకి అన్యాయం కిరణ్ రోడ్‌మ్యాపే చెబుతుంది: కెకె

తెలంగాణ రాష్ట్ర సమితి భవనంలో ఆయన ఇతర నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర సిఎం తెలంగాణ ఇవ్వవద్దని చెబుతుంటే కాంగ్రెసు నేతలు ఆయన పక్కన ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టవద్దని, వెన్నుపోటు పొడువవద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితోనే తెలంగాణ సాధ్యమన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఉద్యమిస్తామని కెకె చెప్పారు.
2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతామన్నారు. అరవై ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధలను అధిగమించేందుకే తెలంగాణ ఏర్పాటు కోరుతున్నామన్నారు. ప్రజా శక్తి ముందు ఏ శక్తీ నిలువదన్నారు. తప్పుడు కేసులు బనాయించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. లక్ష కోట్ల ప్యాకేజీ అని కిరణ్ సూచన ఇవ్వడం హాస్యాస్పదమని, అది ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ తల్చుకుంటే వారంలో తెలంగాణ ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెసు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా నేతల ప్రాబల్యంతోనే తెలంగాణ వెనుకబడిందన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, విలీనం జరిగిన ప్రాంతానికి విమోచన కల్పించాలని కోరారు.
ఇందిర అడ్డుకోలేదు: ఆమోస్
సీమాంధ్ర నేతలు ఇందిరా గాంధీ పైన అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేత ఆమోస్ అన్నారు. ఇందిర విభజనను ఎప్పుడు అడ్డుకోలేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో నిజాం నవాబు వేసిన పిటిషన్ పెండింగులో ఉన్న కారణంగా ఇందిర అప్పుడు తెలంగాణ ఇవ్వలేకపోయారన్నారు.