తెలంగాణ: కొన్నాళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని

తెలంగాణ బిల్లు రూపకల్పనకు కేంద్రం కొందరు మంత్రులతో ఒక కమిటీని వేయవచ్చునని సమాచారం. బిల్లు తయారీకి కనీసం రెండు నెలల కాలం పడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలోనే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.
మంత్రివర్గంలో తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం ఈ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తారు. తెలంగాణ జిల్లాల సంఖ్యను, ఆదాయ వనరుల వివరాలనూ అందులోనే సవివరంగా క్రోడీకరిస్తారని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ తర్వాత తెలంగాణ విషయమై రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతారని వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి
ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అంశంపై అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసే అవకాశాలున్నాయి. సీమాంధ్ర నాయకుల నుంచి పలు రకాలైన వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.
మావోలు రెచ్చిపోతారన్న కావూరి
కాగా, తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాష్ట్ర విభజన జరిగితే మరో చత్తీస్‌గడ్ పునరావృతమవుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గడ్ విడిపోయిన తర్వాత ఏం జరుగుతోందో చూస్తున్నామని, నిత్యం మావో కార్యకలాపాల వార్తలు వింటున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications