జగన్ నాకు, బాబు నాతండ్రికి ఫ్రెండ్: కష్టమేనని అఖిలేష్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు సన్నిహితుడని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు చాలా సన్నిహితుడని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో మూడో కూటమిపై ఆయన స్పందించారు. సాధారణ ఎన్నికల తర్వాతనే మూడో కూటమి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో తాను కచ్చితంగా చెప్పలేనని, చర్చలకు కూడా సమయం ఉందన్నారు. అయితే ఎన్నికల తర్వాతనే మూడో కూటమి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయన్నారు.

ఎన్నికలకు ముందు కూడా ఏవైనా కూటములు వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రతి పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు ఒంటరిగానే పోటీ చేయవచ్చునని, ఎన్నికల తర్వాతనే రాజకీయ పరిస్థితులను బట్టి కూటమిలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో జగన్, తాను సన్నిహితులమని, తాము తమ ఆలోచనలను పంచుకునే వాళ్లమని, ఇద్దరిదీ ఒకే ఏజ్ గ్రూప్ అన్నారు. అదే సమయంలో చంద్రబాబు తన తండ్రికి అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఇందులో ఎవరు థర్డ్ ఫ్రంట్‌లోకి వస్తారో తాను చెప్పలేనన్నారు. ఎవరు థర్డ్ ఫ్రంట్‌లోకి వస్తారో చెప్పడం డిఫికల్ట్ క్వశ్చన్ అన్నారు. దానిని తేల్చేది తమ పార్టీ అధ్యక్షుడు, తమ తండ్రి ములాయం సింగ్ యాదవే అని చెప్పారు.












Click it and Unblock the Notifications