మనసొప్పుకోవట్లేదు: టిపై సోనియా ప్రశ్న, కిరణ్ ఆన్సర్!
న్యూఢిల్లీ: విభజన విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకున్న విషయం తెలిసిందే. వారి మధ్య ఆసక్తికర చర్చ సాగినట్లుగా తెలుస్తోంది. విభజనపై నిర్ణయం సరైనది కాదని, రాజకీయ కోణంలో విభజించడం సరికాదని, దీనిపై పునరాలోచన చేయాలని, విభజనకు తన మనసు ఏమాత్రం అంగీకరించడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి అధినేత్రితో చెప్పారట.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రులు... ఇలా అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారని, ఇప్పుడు మీరు అలా అంటే ఎలా అని సోనియా ప్రశ్నించగా... పార్టీ వ్యక్తిగా.. పార్టీ నిర్ణయాలన్నింటిని తాను అంగీకరిస్తానని కానీ, ఈ ఒక్క విషయంలోనే నిర్ణయం సరికాదని భావిస్తున్నానని చెప్పారట.

ప్రధానితో సీమాంధ్ర నేతల భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా సీమాంధ్ర నేతలు శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే తామంతా రాజీనామాలు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర నేతల సంతకాలతో కూడిన లేఖను ప్రధానికి అందజేశారు.
విభజనకు శాస్త్రీయత ఉండాలని, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రం రాజీనామాలు తప్ప మరో మార్గం లేదని ప్రధానికి తేల్చి చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని వారు కోరారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల రాజీనామాలు పెళ్లైన తర్వాత బాజా మోగించినట్లుగా ఉందని, వారి రాజీనామాలను సోనియా టిష్యూ పేపర్లలా వాడుకుంటారని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications