తెలంగాణ: లోకసభలో జగన్, చంద్రబాబు ఏం చేస్తారు?

కాగా, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏం చేస్తారనేది ఆసక్తికరమైన విషయమే. తెలుగుదేశం లోకసభ సభ్యుల్లో ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ముగ్గురు సీమాంధ్రకు చెందినవారు. సీమాంధ్రకు చెందిన ముగ్గురు ఎలా వ్యవహరిస్తారనేది చెప్పలేని స్థితి. తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కచ్చితమైన ఆదేశాలు ఇస్తారా, లేదా అనేది కూడా చూడాల్సే ఉంది. చంద్రబాబు ఆదేశాలను వారు ఖాతరు చేస్తారా అనేది కూడా చూడాల్సే ఉంది.
తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ బలపరుస్తుందని తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. కానీ, తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెసు అధిష్టానం వేగంగా కదులుతున్న నేపథ్యంలో చంద్రబాబు మౌన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణపై కచ్చితంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోనట్లే.
తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకోనప్పటికీ తాజా పరిణామాలను బట్టి ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదు. వైయస్ జగన్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం లోకసభకు ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, కాంగ్రెసులోనే ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతుగా సబ్బం హరి ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వస్తేనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దాంతో జాతీయ స్థాయిలో తెలంగాణకు ఆ పార్టీ సభ్యులు మద్దతు ఇస్తారు. ఇక, సిపిఎం తెలంగాణను వ్యతిరేకిస్తోంది. కాబట్టి సిపిఎం మద్దతు లభించే అవకాశాలు లేవు.
రేపు తెలంగాణపై కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరిగిన తర్వాత తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఎలా వ్యవహరిస్తాయనేది తేలే అవకాశం ఉంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications