విభజనపై బేరసారాలు ఖతం: ప్రత్యేక ప్యాకేజీలకే..
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ఆగిపోతుందనే ఆశను సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, విభజనపై బేరసారాలు గానీ విభజన ఆగిపోవడం గానీ ఈ పరిస్థితిలో సాధ్యం కాదని తేలిపోయింది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ కూడా సీమాంధ్ర నేతల నుంచి ప్యాకేజీలకు సంబంధించిన బేరాసారాలకు మాత్రమే పరిమితమవుతుందని సమాచారం.
విభజనను ఆపలేమనే నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు వచ్చినట్లు కనిపిస్తోంది. అయినా, ఆందోళన చెందుతున్న సీమాంధ్ర ప్రజలను మెప్పించడానికి మాత్రమే ఇంకా విభజన ఆగుతుందనే ఆశలను కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తేలిపోవడంతో సీమాంధ్ర నాయకులు ప్రత్యేక ప్యాకేజీల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. నదీజలాల పంపకం, రెవెన్యూ విషయాలు, ఉద్యోగుల తీరుతెన్నుల గురించి కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలో స్పష్టంగా పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం మరిన్ని ప్రయోజనాలు పొందే విషయంపై సీమాంధ్ర నాయకులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.

కాపులను బిసీల్లో చేర్చాలనే విషయంపై కేంద్ర మంత్రి చిరంజీవి దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ, దేశం రెండో రాజధానిగా గానీ చేసి ఉభయ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలని ఆయన కోరుతున్నారు. అదే సమయంలో కాపులను బిసీల్లో చేర్చాలని ఆయన అడుగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత కాపులు రాజకీయంగా బలహీనపడుతారని, అందువల్ల వారిని బిసిల్లో చేరిస్తేనే వారి అభివృద్ధి జరుగుతుందని చిరంజీవి కమిటీ ముందు చెప్పడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లలేమని, సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నేతృత్వంలో తనను కలిసిన రాయలసీమ నేతలతో స్పష్టంగా చెప్పారు. ఆంధ్ర నాయకులతో కూడా ఆమె అదే విషయం చెప్పారని సమాచారం.












Click it and Unblock the Notifications