లోన్ రికవరీపై ఆర్బీఐ స్ట్రిక్ట్ రూల్స్: అలాంటివి కుదరవ్: రుణ గ్రహీతలకు ఇకపై.. !!
లోన్ రికవరీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కఠిన నిబంధనలను ప్రకటించింది. రికవరీ ఏజెంట్ల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ఈ నూతన నిబంధనలను ప్రతిపాదించింది. వీటి అమలు గడువును పొడిగించింది కూడా. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ.. ఈ నిబంధనల అమలు తేదీని 2027 జనవరి 1 కి మార్చింది. గతంలో ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
నూతన నియమాలకు అనుగుణంగా బ్యాంకులు తమ అంతర్గత వ్యవస్థల్లో అవసరమైన సాంకేతిక, కార్యాచరణ మార్పులను చేసుకోవడానికి ఈ అదనపు సమయం సహాయపడుతుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ గడువు పొడిగింపు వల్ల బ్యాంకులకు ఊరట లభించినప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకోబోతోన్న ఈ మార్పులు.. రుణ గ్రహీతల ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెట్టినట్టవుతుంది.

లోన్ చెల్లింపుల విషయంలో రికవరీ ఏజెంట్లు గొడవలకు దిగడం, అసభ్య పదజాలాలను ఉపయోగిస్తోండటం వల్ల కలిగే ఇబ్బందుల నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయాలను తీసుకుంది. బ్యాంక్ ఉద్యోగులు గానీ, రికవరీ ఏజెంట్లు గానీ రుణగ్రహీతలను వేధించకూడదని స్పష్టం చేసింది. ప్రైవసీకి భంగం కలిగించేలా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్స్ చేయడం, మొబైల్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా అనుచిత సందేశాలు పంపడం వంటివి ఇకపై కదరవు.
రుణ గ్రహీతల ఇళ్లలో శుభ కార్యాలు, విషాదకర ఘటనలు సంభవించినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి సున్నిత సమయాల్లో రికవరీ కోసం ఒత్తిడి చేయకూడదు. ప్రైవేటు బ్యాంకుల రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా 2022 లో మహీంద్రా ఫైనాన్స్ వంటి పెద్ద సంస్థలు కూడా తాత్కాలిక ఆంక్షలను ఎదుర్కొన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే రిజర్వ్ బ్యాంకు ఈ కఠిన విధానాలను రూపొందించింది.
తాజా నిబంధనల ప్రకారం కస్టమర్ల రికవరీ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి బ్యాంకు ఒక సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లోన్ అగ్రిమెంట్లలోనే ఈ విధానాన్ని స్పష్టంగా తెలియజేయాలి కూడా. బ్యాంకులు పంపించే ఏ రికవరీ నోటీసులపైనైనా సంబంధిత గ్రీవెన్స్ అధికారి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ తప్పనిసరిగా పొందుపర్చాలి. దీనిద్వారా వేధింపులకు గురయ్యే కస్టమర్లు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుంది.
రికవరీ సంస్థలు తమ ఏజెంట్ల పూర్వపరాలను నియామక సమయంలోనూ, ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆర్‌బీఐ సూచించింది. బ్యాంకుల సొంత ఉద్యోగులు ఈ రికవరీ ఏజెంట్ల కిందికి రారు. సాధారణ వాయిదాలను సేకరించే కలెక్షన్ ఏజెంట్లు గా కూడా వారిని పరిగణించరు. మైక్రోఫైనాన్స్ లోన్ల రికవరీకి కూడా ఆర్బీఐ ఈ నిబంధనలను వర్తింపజేయడ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మైక్రోఫైనాన్స్ వసూళ్లు ఎప్పుడూ బ్యాంక్, కస్టమర్ పరస్పరం అంగీకరించిన నిర్దేశిత ప్రదేశంలోనే జరగాలి. లోన్ రికవరీ ప్రక్రియ సజావుగా సాగేలా, కస్టమర్ల ఆత్మగౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా చూసేందుకు ఆర్‌బీఐ అమలు చేస్తున్న ఈ మార్పులు మరింత పారదర్శకతను తీసుకువస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి.





Click it and Unblock the Notifications