ధర్నా కొనసాగిస్తున్న రాహుల్, ప్రియాంక..! స్పందించిన ఈసీ వర్గాలు..!
ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు స్వయంగా నేతృత్వం వహించిన విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతలతో కలిసి ఇంకా ధర్నా కొనసాగిస్తున్నారు. ఈసీని కలిసే వరకూ తాము వెనుదిరిగి వెళ్లేది లేదని వీరు భీష్మించారు.
ఇవాళ ఉదయం ఇండియా కూటమి పార్టీలతో కలిసి ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర విపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. వీరికి విద్యార్ధి సంఘాలు కూడా జత కలవడంతో గంటల పాటు ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగాయి. పోలీసుల బ్యారికేడ్లను దాటుకుంటూ రాహుల్ గాంధీ ఈసీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వదిలిపెట్టలేదు. దీంతో పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లోకి రాహుల్, ప్రియాంక ఇతర నేతలు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటి తర్వాత వదిలిపెట్టేశారు.

దీంతో వారు తిరిగి ఆకాశవాణి భవన్ లోకి వెళ్లి అక్కడే ధర్నా చేపట్టారు. అప్పటి నుంచీ ఈసీని కలిసేందుకు తమకు అనుమతి ఇచ్చే వరకూ కదిలేది లేదంటూ రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నేతలు చీకటి పడినా అక్కడే కూర్చొన్నారు. దీంతో ఇవాళ రాత్రికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పోలీసులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీల నుంచి సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను కానీ, ఇతర కమిషనర్లను కలిసేందుకు ఎలాంటి అభ్యర్ధన రాలేదని ఈసీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. దీంతో ఎవరు నిజం చెప్తున్నారో తెలియని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇవాళ జంతర్ మంతర్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ సాగిన నిరసనల పర్వం కేంద్రాన్ని ఇరుకునపెడుతోంది. అయినా ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో కేంద్రం మౌనం వహిస్తోంది. దీంతో ఈ నిరసనలు ఇంకా పెరుగుతున్నాయి.














Click it and Unblock the Notifications
