Amaravati: అమరావతికి భారీ గుడ్ న్యూస్..! ఏకంగా 1200 కోట్లు..!
ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నగర నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఐదేళ్ల పాటు ఆగిపోయిన పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు వరుసగా ప్రణాళికలు సిద్దం చేసి, వాటిని అమల్లో పెడుతున్న ప్రభుత్వం.. అందుకు తగిన నిధుల్ని కూడా భారీగా కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మరో 1200 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ జీవో ఇచ్చింది.
అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని నగర అభివృద్ది ప్రాజెక్టు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి రూ.1,200 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ జీవోఆర్టీ నంబర్ 1240ను జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.6 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉండగా, మూడో త్రైమాసికానికి రూ.1,200 కోట్లను కేటాయించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవాళ కేటాయించిన రూ.1200 కోట్ల నిధులను అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ప్రధాన పనుల అమలుకు వినియోగించనున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చుల కోసం ఏపీ సీఆర్డీయే ఖాతాలో ఈ నిధులను జమ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టుల అమలుకు అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులు సిద్ధం చేసి, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)కు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో త్వరలోనే సీఆర్డీయే ఖాతాలో ఈ నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు అమరావతిలో ప్రధానమైన పనుల్నీ వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు క్షేత్రస్దాయిలో అధికారుల్ని పరుగులు తీయిస్తోంది. అందుకు తగినట్లుగానే అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు కూడా సకాలంలో అందుతుండటంతో ఈ మేరకు ప్రభుత్వం కూడా నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది.













Click it and Unblock the Notifications
