అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. రూ.599 కోట్ల రైల్వేలైన్‌కు టెండర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే ఇస్తున్న వరాలు అన్నీ ఇన్నీ కావు. వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్ లతో ఏపీలో రైలు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది ఇండియన్ రైల్వే. రాజధాని అమరావతి అభివృద్ధిలో కూడా రైల్వే కీలక భూమిక పోషిస్తుంది. ఈ క్రమంలో అమరావతికి కనెక్టివిటీని పెంచే రైల్వే ప్రాజెక్ట్ లో మరో ముఖ్యమైన అడుగు పడింది.
రాజధాని ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్‌లో చివరి ప్యాకేజీకి టెండర్లు ఆహ్వానించారు.వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి రూ.599.33 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు.ఈ రైల్వే లైన్ పనుల కోసం నవంబర్ 23 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈపీపీ విధానంలో చేపట్టే ఈ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

మొత్తం ప్రాజెక్టు 58.10 కిలోమీటర్ల పొడవు ఉండి నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి మూడు ప్యాకేజీలకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా, తాజాగా నాలుగో ప్యాకేజీకి కూడా టెండర్ లను ఆహ్వానించారు. ఈ లైన్ పూర్తయితే అమరావతి రాజధాని ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగవడంతోపాటు ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది.
వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ రైల్వే ప్రాజెక్ట్ లో మొత్తం తొమ్మిది చోట్ల రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పరావురు ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ రైల్వే ప్రాజెక్టు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధానికి మంచి రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఎక్కడైతే రవాణా సదుపాయాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని భావించిన క్రమంలోనే రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఆకాశ మార్గాలను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం.












Click it and Unblock the Notifications
