మోడీది వాక్చాతుర్యమే: బొత్స, జగన్‌పై ఫైర్

అధికారంలో ఉన్నప్పుడు బిజెపి దేశ సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. దేశ భద్రతపై మోడీ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశ సైన్యాన్ని కించపరచడమే జాతీయతా అని ఆయన బిజెపి నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెసుపై మోడీ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెసు అసత్య ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.
అద్వానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారని, అంటే బిజెపి విధానం లేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసుపై విమర్శలు చేయడం తప్ప జాతీయ దృక్పథంతో మోడీ జాతీయ సమస్యలపై, అభివృద్ధిపై మాట్లాడలేదని ఆయన అన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ముషారఫ్‌ను ఆహ్వానించిందెవరని ఆయన అడిగారు. ముషార్రఫ్ దంపతులు భారత్ వస్తే బిర్యానీ తినిపించింది బిజెపి నాయకులేనని ఆయన అడిగారు. ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేస్తే సామాన్యుడి కడుపు నిండుతుందా అని ఆయన అడిగారు.
కాందహార్‌లో ఉగ్రవాదులు బిజెపి ప్రభుత్వ హయాంలో విమానాన్ని హైజాక్ చేస్తే ముగ్గురు కరుడు గట్టిన తీవ్రవాదులను వదిలిపెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని గురించి గానీ, రక్షణ శాఖ గురించి గానీ మోడీ, ఇతర బిజెపి నాయకులు మాట్లాడిన తీరు చూస్తుంటే వారి జాతీయ భావం, దృక్పథం ఏమైందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. భారత సైన్యం సమర్థత పలు మార్లు నిరూపితమైందని చెప్పారు. రైతులపై, సామాన్యులపై బిజెపికి విధానం లేదని ఆయన అన్నారు. ఏం చేసిందని బిజెపిని గెలిపించాలని ఆయన అడిగారు. అక్షరధామ్‌లో ఉగ్రవాదులు దాడి చేస్తే మోడీ ఏం చేశారని ఆయన అడిగారు. సర్దార్ పటేల్ వంటి నాయకుడు తమ పార్టీలో లేడని బిజెపి నాయకులు అంగీకరించారని ఆయన అన్నారు.
జగన్‌పై బొత్స ఫైర్
తెలంగాణపై కాంగ్రెసు విధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు డిమాండ్ చేశారని, కాంగ్రెసు చెప్పిన తర్వాత ఆ పార్టీ అధ్క్షుడు జగన్, విజయమ్మ రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. సమైక్యంగా ఉంచాలని వారు రాసిన లేఖలో ఎక్కడైనా ఉందా, రాజకీయ లబ్ధి కోసమే వారిద్దరు లేఖలో విషయాలు ప్రస్తావించారని, అఖిలపక్ష సమావేశంలో ఆ లేఖలోని విషయాలు చెప్పారా అని ఆయన అన్నారు.
కాంగ్రెసుకు చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు తమ మాట ఉన్నారని, సీమాంధ్ర నాయకులు సమైక్యంగా ఉంచాలని అన్నారని, తెలంగాణ నాయకులు వేరు రాష్ట్రం కావాలని అన్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారి మాదిరిగా గంటకో మాట, పూటకో మాట మాట్లాడలేదని ఆయన అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడే అయినా సీమాంధ్ర ప్రాంత గడ్డ మీద పుట్టిన బిడ్డగా తన అభిప్రాయం చెప్పానని, వారిని తన మాదిరిగా చెప్పాలని అడగాలని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా నాయకులు ఎలా వ్యవహరిస్తారని ఆయన అడిగారు.
పార్టీ ఏది చెప్పిందో దాన్ని అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుందని, నేతలుగా తమకు బాధ ఉందని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని విభజించాలని కోరాయని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు కోరడం వల్లనే కేంద్రం విభజనపై నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. పూటకో మాట చెప్పడం తమ పార్టీ నైజం కాదని బొత్స అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్లనే తెంలగాణ ఇవ్వలేకపోయామని అద్వానీ అన్నారని బొత్స గుర్తు చేశారు.
విభజనపై పున:పరిశీలించాలని కాంగ్రెసు పార్టీ ఒక్కటే కోరుతోందని బొత్స చెప్పారు. విభజనపై తమ పార్టీ అధిష్టానం పున:పరిశీలిస్తోందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. తాము అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని, వేడుకుంటున్నామని చెప్పారు. ఆంటోనీ కమిటీ పార్టీ అంతర్గత కమిటీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications