న్యూయార్క్‌లో అదిరిపోయిన ఇండియా డే పరేడ్..‘తారక్ మెహతా’ ఫ్లోట్కు భారీ క్రేజ్!
న్యూయార్క్:అమెరికాలో భారతీయ సంస్కృతి,సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) 44వ వార్షిక ఇండియా డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించింది. 'హార్మనీ ఇన్ హెరిటేజ్'థీమ్‌తో ఆదివారం ఆగస్టు 16న జరిగిన ఈ వేడుకలకు మాన్‌హట్టన్‌లోని మాడిసన్ అవెన్యూ వేదికగా మారింది.సుమారు 2 లక్షల మంది ప్రేక్షకులు ఈ భారీ కార్యక్రమానికి తరలివచ్చారు. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం,అమెరికా 250వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ ఏడాది పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోకుల్ పరేడ్‌ను ముందుండి నడిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటి పూజా హెగ్డే, నటుడు-దర్శకుడు అడివి శేష్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు. అయితే ప్రముఖ టీవీ షో 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' బృందం పాల్గొనడంతో పరేడ్‌కు మరింత జోష్ వచ్చింది.

'తారక్ మెహతా' ఫ్లోట్‌పై నిర్మాత అసిత్ కుమార్ మోదీతో పాటు దిలీప్ జోషి, మందార్ చంద్వాడ్కర్, మున్మున్ దత్తా, సోనాలికా జోషి, బల్వీందర్ సింగ్ సూరి, నితీష్ భలూని తదితర నటీనటులు సందడి చేశారు. ఈ ఫ్లోట్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
మొత్తం 55 ఫ్లోట్లు పరేడ్‌లో పాల్గొన్నాయి. వివిధ సాంస్కృతిక సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రాంతీయ సంఘాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. వీటికి తోడు మార్చింగ్ బ్యాండ్లు, నృత్య బృందాలు, వివిధ ప్రాంతాల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం కూడా ప్రత్యేక ఫ్లోట్‌తో పాల్గొంది.
పరేడ్‌తో పాటు ఫుడ్ ఫెస్టివల్, కమ్యూనిటీ బూత్‌లు, సంప్రదాయ సంగీతం-నృత్యాలతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. FIA ఛైర్మన్ అంకుర్ వైద్య, అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి ప్రముఖులకు స్వాగతం పలికి వేడుకలను సమన్వయం చేశారు. అమెరికాలో భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ-అమెరికన్ సమాజాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే FIA ప్రధాన లక్ష్యం.












Click it and Unblock the Notifications
