సుస్మితా.. రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోవు.. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసు!
వరంగల్ జిల్లా రాజకీయాలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత హాట్ హాట్ గా మారాయి. పరకాల నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రకటన చేసిన సీఎం పరకాల నియోజకవర్గం నుండి మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు.
రేవంత్ ను టార్గెట్ చేసిన కొండా సుస్మిత
ఇక వచ్చే ఎన్నికలలో అక్కడి నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండ సుస్మిత భావిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కొండ ఫ్యామిలీకి బిగ్ షాక్ అయింది. అయితే దీనిపైన తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత స్పందించారు. సీఎంకు కళ్ళు నెత్తికెక్కాయి అని, రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించడం ఎలా చేస్తారంటూ సుస్మిత మండిపడ్డారు.

రేవంత్ అన్నదమ్ముల బాగోతం బయట పెడతా అంటున్న కొండా సుస్మిత
అంతేకాదు దమ్ముంటే రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసి తన పైన పోటీ చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేయాలని అప్పుడు ఎవరు గెలుస్తారో అందరికీ తెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొండా మురళిని పట్టించుకోవడంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుస్మిత అన్నదమ్ములు చేసిన బాగోతాన్ని బయట పెడతానంటూ హెచ్చరికలు చేశారు.
డైపర్లు వేసుకునే వాళ్లని అభ్యర్థిగా ప్రకటిస్తారా?
జెన్ జీ జపం చేస్తూనే డైపర్లు వేసుకునే వయసు వచ్చిన వాళ్ళకి ఎలా మళ్లీ అవకాశం ఇస్తారని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికలలో తన గెలుపును ఎవరు ఆపలేరని, మరో 20 ఏళ్ల పాటు పరకాలకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని సుస్మిత వ్యాఖ్యలు చేశారు.ఇక సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి సుస్మిత వ్యాఖ్యల పైన వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఘాటుగా స్పందించారు.
సుస్మిత వ్యాఖ్యలపై భగ్గుమన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే
గౌరవ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటూ పేర్కొన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేని వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆమెకు మాట్లాడడానికి, కనీస అర్హత కూడా లేదని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా ఆమె సరిపోదని కెఆర్ నాగరాజు అన్నారు. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసని వ్యాఖ్యలు చేశారు.
సుస్మిత వ్యాఖ్యలకు రేవూరి ప్రకాష్ రెడ్డి సమాధానమిదే
చిన్న, పెద్ద తేడా లేకుండా మాట్లాడితే, ఆమె వెనక ఎవరున్నారో కూడా తెలుసు అంటూ స్పందించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా సుస్మిత వ్యాఖ్యలకు బదులిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని, సరైన సమయంలో దీటుగా సమాధానం చెబుతాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ఉన్న మంచి పేరు ఇంటిలిజెంట్ రిపోర్ట్ ల ఆధారంగానే సీఎం తనను అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. సరైన సమయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకొని సమాధానం చెబుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications