పొత్తు కాదు, నిలబడండి.. కావాలంటే మళ్లీ వస్తా: మోడీ
హైదరాబాద్: పొత్తుల అంశాన్ని పక్కన పెట్టాలని, ముందు మనం సొంత బలం పెంచుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశనం చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నవ భారత యువ భేరీ బహిరంగ సభ కోసం వచ్చిన మోడీ సాయంత్రం బిజెపి పదాదికారుల సమావేశంలో రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశనం చేశారు.
మనకు ఎంతగా అనుకూలంగా ఉన్నా విజయం సాధిస్తామని అనుకోవద్దని సూచించారు. గాలి ఎంత బాగా వీచినా సైకిల్ ట్యూబ్‌లోకి ఎక్కదని, పైప్ ఆధారంగా ఉంటేనే ఎక్కుతుందని, అలాగే బిజెపికి ఎంత గాలి వీచినా కిందిస్థాయి నుండి కార్యకర్త పని చేస్తేనే విజయం సాధిస్తామన్నారు. యజ్ఞంలా తీసుకొని, ఒక్కో కార్యకర్త ఇంటింటికి తిరగాలని, ఒక్కో పోలింగ్ బూత్‌లో ఉండే కుటుంబాలను కలిసేందుకు కార్యకర్తలు తిరగాలన్నారు.

ప్రజల్లో కలిసిపోతే పైసా ఖర్చు చేయకుండా, టీవిల్లో ప్రకటనలు ఇవ్వకుండా విజయం సాధించవచ్చునని చెప్పారు. గుజరాత్‌లో కార్యకర్తలు బూత్ స్థాయిలో శ్రమిస్తారన్నారు. ఎవరితో కలిస్తే గెలుస్తామా అన్న భావన పక్కన పెట్టాలన్నారు. ముందు సొంత బలం పెంచుకోవాలని, అప్పుడు మనతో కలిసేందుకు ఇతరులే వస్తారని సూచించారు. మనం నిలబడకుంటే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
సామాజిక మాధ్యమం పైన దృష్టి పెట్టాలని సూచించారు. బిజెపిని ఓడించేందుకు కాంగ్రెసు పార్టీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా కోసం ఖర్చు చేసినా ఫలితం ఉండటం లేదన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాను అధికంగా వినియోగించే యువత బిజెపి పక్షాన ఉందన్నారు. రాష్ట్రంలో కూడా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications