నిరవధిక సమ్మె: ఎక్కడికక్కడ బంద్, తిరుమలకు సెగ

తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం రగులుతోంది. ఈ సమ్మె 13 రోజులుగా 13 సీమాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలకు మరింత ఊపు తేనుంది. ఎపిఎన్జీవో పిలుపు మేరకు ఆ సంఘానికి చెందిన అనుబంధ సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలు కలిపి మొత్తం 56 సంఘాలకు చెందిన 4.50 లక్షల మంది సమ్మెకు దిగారు.
వీరితోపాటు 70 వేల మంది ఆర్టీసీ కార్మికులు కూడా బంద్‌కు సై అన్నారు. తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాల వంటి సేవలు వారం రోజులు మాత్రమే నిర్వహిస్తామని ఆ తర్వాత అవీ బంద్ చేస్తామని మునిసిపల్ ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు. ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో సీమాంధ్రలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు మొత్తం నిలిచిపోనుంది.
ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల సిబ్బంది సమ్మెతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడనుంది. ఆయా జిల్లాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. పలుచోట్ల సమైక్యవాదులు రాస్తారరోకోలు నిర్వహించారు. సీమాంధ్రలో ఇరవై నాలుగ గంటల పాటు పెట్రోలు బంకులు బంద్ పాటిస్తున్నాయి. కాగా సమ్మె నేపథ్యంలో సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
తిరుమలకు సమ్మె సెగ
రాష్ట్ర విభజన సెగ తిరుమలకూ తాకింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా నిత్యం రద్దీగా ఉండే తిరుమల బోసిపోయింది. ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా తిరుమల కొండకు బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. తిరుమలకు మినహాయింపు ఇవ్వాలని టిటిడి, ఆర్టీసి యాజమాన్యాలు చేసిన విన్నపాలను కార్మికులు తిరస్కరించారు. తిరుమలకు ఆర్టీసి సేవలు ప్రారంభమైన 38 ఏళ్లలో ఒక్కరోజు కూడా బస్సులు ఆగలేదు.
ఆందోళనలు జరిగినా తిరుమలకు మినహాయింపు ఉండేది. విభజనకు వ్యతిరేకంగా జూలై 31 నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైనా, తిరుమలకు మినహాయింపు ఇచ్చారు. తాజాగా, సమ్మె కొనసాగినంత కాలం తిరుమలకు రావద్దని, వచ్చి అవస్థలు పడొద్దని భక్తులకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. తిరుమలకు బస్సు మార్గం టిటిడి హయాంలో నడిచిన 1972-73లో జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 1975లో టిటిడి ఉద్యోగులకు, ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులకు మధ్య గొడవలు జరగడంతో మూడు రోజుల పాటు బస్సులను నిలిపేశారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
తిరుమలకు రోజుకు సగటున 70 వేల మంది వస్తుంటే వారిలో 55 వేల మంది ఆర్టీసీ బస్సుల్లోనే వస్తున్నారు. సమ్మె కారణంగా ఆర్టీసీ రోజుకు రూ.20 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాగా, తిరుపతి- తిరుమల మధ్య రవాణా విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని టిటిడి అధికారులు చెప్పారు. తిరుపతి - తిరుమల కనుమ రహదారిలో తిరిగే సుమారు 500 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణలో బస్సులు యథాతథం
కాగా సీమాంధ్రలోని ఆర్టీసీ కార్మికులు సమైక్యాంధ్ర డిమాండ్‌తో సమ్మెకు దిగితే తామూ తెలంగాణ కోసం సమ్మె చేస్తామని ప్రకటించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్ర విభజన నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కు తగ్గిన పక్షంలో మాత్రమే సమ్మెకు వెళతామని తెలిపింది.












Click it and Unblock the Notifications