ఈ మూడింటికి జవాబివ్వండి: టిపై కాంగ్రెస్‌కు వెంకయ్య

విభజన విషయంలో తమను విశ్వాసంలోకి తీసుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు చెబుతున్నారని, అదే సమయంలో కాంగ్రెసు పార్టీ మాత్రం తాము లోతుగా చర్చించాక నిర్ణయం తీసుకున్నామని చెబుతోందని, ఇందులో ఏది నిజమో చెప్పాలన్నారు.
విభజన అంశం కాంగ్రెసు పార్టీ సొంత వ్యవహారం కాదన్న వెంకయ్య... పార్టీలో సుదీర్ఘ చర్చలు జరిగాయని చెబుతున్న పెద్దలు మళ్లీ ఆంటోనీ కమిటీని ఎందుకు వేశారో చెప్పాలన్నారు. ఆ కమిటీ పేరుతో ఎవరిని మభ్యపెట్టేందుకని ప్రశ్నించారు. ఆంటోని కమిటికీ ఉన్న చట్టబద్ధత ఏమిటన్నారు.
విభజనపై కాంగ్రెసు పార్టీలో విస్తృతంగా చర్చలు జరిగితే సీమాంధ్ర నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారన్నారు. సాక్ష్యాత్తు సిఎం, పిసిసి చీఫ్, మంత్రులే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు చెబుతుండగా, తమ పార్టీ ఈ వ్యవహారంపై వెనక్కి వెళ్లలేదని చెప్పలేమని సీమాంధ్ర నేతలు అంటున్నారని, ఇదెక్కడి గందరగోళమని మండిపడ్డారు.
సున్నితమైన అంశంపై రాజకీయాలకతీతంగా స్పందించాలన్నారు. ఇది పార్టీ సొంత వ్యవహారం కాదన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ విధానం ఏమిటి, కేంద్రం ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. కేంద్రమంత్రి చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటన ద్వారా మళ్లీ అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణపై నిర్ధిష్ట పరిమితి చెప్పలేమని చిద్దు ఎలా చెప్పారన్నారు. ఆయన ప్రకటనలో స్పష్టత లేదన్నారు.
సున్నితమైన అంశంపై రాజకీయం చేయవద్దని కోరారు. ఏ ప్రాంతం వారు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఉన్న పరిపక్వత రాజకీయ నాయకులకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications