అలయెన్స్: బాబును ఆలోచనలో పడేసిన మోడీ?

హైదరాబాద్: బిజెపి ప్రచార రథ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ ప్రసంగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆలోచనలో పడేసినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తృతీయ ఫ్రంట్‌తో కలిసి నడవడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ అది నిర్దిష్టమైన రూపం తీసుకోవడం లేదు. ఈ స్థితిలో మోడీ పరోక్ష అహ్వానం చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు చెబుతున్నారు.

తిరిగి ఎన్డీయె చట్రంలోకి వెళ్లాలా, వద్దా అనే విషయంపై తెలుగుదేశం పార్టీలో చర్చ మాత్రం సాగుతోంది. అయితే, మోడీ హైదరాబాద్ ప్రసంగాన్ని చంద్రబాబు, పార్టీ నాయకులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మతం రంగు ఎక్కడా ఈ ప్రసంగంలో కనిపించకపోవడాన్ని వారు గమనించినట్లు చెబుతున్నారు. మజ్లీస్ బలం తగినంతగా ఉన్న హైదరాబాదులో ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. మజ్లీస్‌కు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా ఆయన ప్రసంగంలో లేదు. నిజానికి, మోడీ హైదరాబాద్ ప్రసంగం ఇంతకు ముందటి ప్రసంగాల కన్నా భిన్నంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Chandrababu and Narendra Modi

మోడీ ప్రసంగంలో హిందూత్వ భావజాలం కనిపించలేదు. అతివాద హిందూత్వ పంథా నుంచి ఆయన దూరం జరిగినట్లుగా ఆ ప్రసంగం ఉంది. బుర్కా, పప్పీ వంటి ట్రేడ్ మార్క్ పదజాలం ఆయన ప్రసంగంలో లేవు. పైగా, కలుపుకునిపోవడం గురించి ఎక్కువగా మాట్లాడారు. అయితే, మోడీ వ్యవహారాన్ని ఇంకా పరిశీలించాల్సే ఉందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

పైగా, లౌకికవాదానికి అనుకూలంగా మోడీ ప్రసంగం సాగింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమే అవుతుందని ఆయన అన్నారు. ఇండియా ఫస్ట్ అనే తన నినాదాన్ని చెప్పారు. దానికితోడు, ఎన్టీ రామరావును ఆకాశానికెత్తారు. అది సరిపోదని, కాంగ్రెసు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్రం ఏర్పడడానికి ఎన్టీ రామరావు కారణమని, ఆ వారసత్వాన్ని టిడిపి కొనసాగించాలని ఆయన అన్నారు.

అయితే, ఎన్డీయేలో భాగస్వాములం కావడం వల్లనే ముస్లింలు తమ పార్టీ దూరమయ్యారని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ భావిస్తున్నారు. గోద్రా మచ్చ కారణంగా రాష్ట్రంలోని ముస్లింలు మోడీతో జత కడితే మరింతగా దూరమవుతారని ఆయన అనుకుంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి చంద్రబాబు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

మోడీ సభకు ముందే మజ్లీస్ అధినే అసదుద్దీన్ ఓవైసీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. బిజెపితో పొత్తు పెట్టుకోకూడదని ఆయన చంద్రబాబుకు సూచించారు. హైదరాబాద్ లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓవైసీ మాటలను చంద్రబాబు కొట్టిపారేయబోరని అంటున్నారు. అయితే, మోడీ పిలుపునకు మాత్రం ఏదో రీతిలో చంద్రబాబు త్వరలోనే ప్రతిస్పందిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+