కిష్త్వార్ మంటలు: ఒమర్ అబ్దుల్లాకు సెగ (పిక్చర్స్)
కాశ్మీర్: మత ఘర్షణలతో కిష్త్వార్ జిల్లా అట్టుడుకుతోంది. వాటిని అరికట్టడంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏ మాత్రం సఫలం కావడం లేదు. ఘర్షణల కారణంగా జమ్మూలోని మరో ఐదు జిల్లాల్లో ఆదివారం కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు సైనిక దళం ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించగా, హింసాకాండకు కేంద్ర బిందువుగా ఉన్న కిస్త్వార్ జిల్లాలో రాజకీయ నాయకులెవరూ ప్రవేశించకుండా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం నిరోధించింది. రాష్ట్రంలో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీని జమ్మూ విమానాశ్రయంలోనే అరెస్టు చేసి వెనక్కి పంపేశారు.
కిష్త్వార్ జిల్లాలో శుక్రవారం మత ఘర్షణలు చెలరేగడంతో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో ఈ జిల్లాలో ఆదివారం వరుసగా మూడో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగించారు. అలాగే శనివారం రాత్రి జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో హింసాకాండ, గృహదహనాలు చోటుచేసుకోవడంతో సైనిక దళాన్ని రంగంలోకి దింపి కర్ఫ్యూ విధించిన అధికారులు దోడా జిల్లాలోని భదేర్వా పట్టణంతో పాటు ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలకు ఆదివారం కర్ఫ్యూను పొడిగించారు. దీంతో జమ్మూ ప్రాంతంలోని మొత్తం పది జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినట్టయింది.

ఒత్తిడిలో ఒమర్ అబ్దుల్లా
కిష్త్వార్‌లో చెలరేగిన హింసతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. కిష్త్వార్‌లో చెలరేగిన విద్వేషపు సెగలు ఆయనకు నిద్రను దూరం చేస్తున్నాయి.

సైనిక గస్తీ..
జమ్మూలో కర్ఫ్యూ విధించిన వేళలో గస్తీ తిరుగుతున్న సైనిక సిబ్బంది. కిష్త్వార్ ఘర్షణల నేపథ్యంలో నిరసనల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. ఇది సోమవారంనాటి దృశ్యం..

కొనసాగుతున్న అశాంతి..
సోమవారంనాడు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద కిష్త్వార్ ఘర్షణలకు నిరసనగా ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన జమ్మూ కాశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యులను నిలువరిస్తున్న పోలీసులు...

కర్ఫ్యూ విధింపు...
జమ్మూలో సోమవారం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రఘునాథ్ ఆలయం సమీపంలో కాపు కాస్తున్న భద్రతా సిబ్బంది. కర్ఫ్యూ సందర్భంగా పలు చోట్ల భద్రతను పెంచారు.

పోలీసులకు, నిరనసనకారులకు మధ్య ఘర్షణ
కిష్త్వార్ అల్లర్లకు నిరసనగా శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్డులో మార్చ్ తలపెట్టిన ముస్లిం ఖావాతీన్ మర్కాజ్ కార్యకర్తలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

సైనిక గస్తీ...
కిష్త్వార్ ఏరియాలో హింస చేలరేగన తర్వాత కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న సైనికులు, భద్రతా సిబ్బంది.

పోలీసు లాఠీచార్జీ
కిష్త్వార్ అల్లర్లకు నిరసనగా జమ్మూ బంద్ తలపెట్టిన సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. జమ్మూలో పెద్ద యెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అదుపు చేయలేని అబ్దుల్లా
కిష్త్వార్ అల్లరకు నిరసనగా జమ్మూలో శనివారం బంద్ నిర్వహించారు. జమ్మూ బంద్ సందర్భంగా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. నిఘాలో భద్రతా సిబ్బంది ఇలా..

జమ్మూలో కర్ఫ్యూ
కిష్ట్త్వార్ అల్లరలపై జమ్మూలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ సందర్భంగా జమ్మూలో కర్ఫ్యూ విధించారు. సైనిక సిబ్బంది ఈ కర్ఫ్యూ ప్రాంతాల్లో అప్రమత్తంగా గస్తీ తిరుగుతూ ఇలా..

జమ్మూ బంద్
కిష్త్రార్ అల్లర్లకు నిరసనగా జమ్మూ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

రఘునాథ్ బజార్ క్లోజ్
జమ్మూలో నిరసనల సందర్భంగా నిరసన పెల్లుబుకిన నేపథ్యంలో రఘునాథ్ బజార్‌ను మూసేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ బజార్ వద్ద పోలీసులు భద్రతగా ఇలా...

మంత్రి రాజీనామా
కిష్త్వార్ అల్లర్లకు నిరసనగా జమ్మూ కాశ్మీర్ మంత్రి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత జమ్మూలో ఆయన ఇలా..
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జుగల్ కిశోర్‌తో కలసి జైట్లీ పర్యటనలో పాల్గొనాల్సి ఉన్న బిజెపి రాజ్యసభ సభ్యుడు అవినాష్ రాయ్ ఖన్నా ఆదివారం ఉదయం కిష్ట్వార్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలో కల్లోలిత ప్రాంతాలను సందర్శించాలని భావిస్తున్న తనను శ్రీనగర్‌లో ఇంటి నుంచి బయటికి రానీయడం లేదని ప్రతిపక్ష పిడిపి (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీ ధ్వజమెత్తారు.
అయితే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న స్వార్ధంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కిష్ట్వార్‌లో ఘర్షణలను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో టెలిఫోన్‌లో మాట్లాడానని, బిజెపి శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టవద్దని సూచించాల్సిందిగా సుష్మా స్వరాజ్‌ను కోరానని ఆయన చెప్పారు.
కిస్త్వార్ జిల్లాలో చెలరేగిన అల్లర్లపై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ హోం శాఖ సహాయ మంత్రి సాజద్ కిచ్‌లూ సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కిస్త్వార్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశించారు.
కాగా, కిష్త్వార్ జిల్లాలోని మత ఘర్షణలపై, వాటిని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీకోర్టు మంగళవారం జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆగస్టు 21వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కిష్త్వార్ జిల్లాలో కర్ఫ్యూ కారణంగా నిలిచిపోయిన యాత్రులు తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.












Click it and Unblock the Notifications