కిరికిరి వద్దు: తెలంగాణపై కిరణ్‌కు సోనియా వార్నింగ్

దిగ్విజయ్ సింగ్ సోమవారం కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి సోనియా చెప్పిన విషయాలను వివరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సామరస్యవూర్వకంగా సహకరించడం తప్ప మరో మార్గం లేదని దిగ్విజయ్ సింగ్ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు సోనియా కట్టుబడి ఉన్నారని, అయితే అదే సమయంలో విభజనకు సహకరించే విషయంలో మీ బాధను అర్థం చేసుకోలేనని దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డితో అన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేసినా, మంత్రులు రాజీనామా చేసినా అంగీకరించేది లేదని దిగ్విజయ్ సింగ్ చాలా కఠినంగా చెప్పినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేయడం ఆపించి, సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు తెలంగాణ ఏర్పాటుకు సహకరించేలా చూడాలని దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.
మీడియా సమావేశంపై తమకు ఫిర్యాదులు పెద్ద యెత్తున వచ్చాయుని, ఈ విషయంలో పార్టీ అధిష్టానానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. గత వారం కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీమాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీన్ని బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలు కూడా అవకాశంగా తీసుకుని కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నాయి.
రాష్ట్ర విభజన చేస్తే తలెత్తే పరిణామాలను మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్‌కు వివరించడానికి ప్రయత్నించినట్లు, అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారని అంటున్నారు. సీమాంధ్ర నిరసనల విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఆందోళనలను అణచేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications