కెసిఆర్‌కు మరో షాక్: మెదక్ నుంచి రాహుల్ గాంధీ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కాంగ్రెసు పార్టీ మరో షాక్ ఇవ్వబోతుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే తెరాస నాయకులను తమ పార్టీలోకి తీసుకుంటూ ఆ పార్టీని నిర్వీర్యం చేసే పనికి పూనుకోగా, ఈసారి ఏకంగా కెసిఆర్ కోటనే కొట్టేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. మెదక్ లోకసభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలంటే దక్షిణాది రాష్ట్రాల సీట్లే కాంగ్రెసుకు కీలకమనే విషయం తెలిసిందే. గత రెండు సార్లు కూడా కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెసుకు ఎన్నికైన లోకసభ సభ్యులనే విషయం అందరికీ తెలుసు. మరోసారి ఇక్కడి నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవాలనే రాజకీయ లక్ష్యంతోనే కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుందనేది వాస్తవం. కాంగ్రెసు పార్టీ అంగీకరించకపోయినా అదే నిజం. రాష్ట్రాన్ని విభజిస్తే తమకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు వస్తాయని రాష్ట్ర పర్యటనను ముగించుకుని వెళ్లి బెంగళూర్‌లో ఆ మధ్య కాలంలో కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

తాము అధికారంలోకి రావడానికి దక్షిణాది నుంచి కనీసం 50 లోకసభ సీట్లు అవసరమవుతాయని కూడా ఆయన చెప్పారు. కర్ణాటకలో బిజెపి స్వయంకృతాపరాధం వల్ల తమ పార్టీ పరిస్థితి మెరుగైందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తమిళనాడులో తమకు అవకాశం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు గెలుచుకోవడమే మార్గంగా కాంగ్రెసు నిర్ణయానికి వచ్చింది. దీంతో రాష్ట్ర విభజన చేసి తెలంగాణలోనైనా పూర్తి స్థాయిలో సీట్లు గెలుచుకోవాలనే ఆలోచనతో ఉంది. రాహుల్ గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తే తెరాసను తెలంగాణలో వెనక్కి నెట్టడానికి పనికి వస్తుందని అంటున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తే కెసిఆర్ పూర్తి స్థాయిలో మెదక్‌పై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని, దానివల్ల ఇతర నియోజకవర్గాల్లో దాని ప్రభావం పడి కాంగ్రెసు పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు.
అయితే, మెదక్ నుంచి తెరాస సభ్యురాలిగా గెలిచిన విజయశాంతి కాంగ్రెసులో చేరడం ఖాయమైంది. మెదక్ సీటు ఇవ్వకూడదని కెసిఆర్ ఆలోచించడం వల్లే ఆమె కాంగ్రెసుకు మారాలని అనుకున్నట్లు చెబుతున్నారు. అయితే, విజయశాంతికి కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సీటును హామీ ఇస్తుండవచ్చునని అంటున్నారు. అది విజయశాంతికి మరింత ఊరట కలిగించే విషయమవుతుంది. అప్పుడు కెసిఆర్‌ను ఎదుర్కోవడం సులభమవుతుందని కూడా భావిస్తున్నారు.
కాగా, మెదక్ లోకసభ నియోజకవర్గం నిజానికి కాంగ్రెసుకు పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. స్వర్గీయ ఇందిరా గాంధీ 1980 -84 మధ్య కాలంలో మెదక్ లోకసభ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. దానివల్ల తెలంగాణలో ఇందిరాగాంధీపై ఉన్న అభిమానం కూడా కాంగ్రెసుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. 1957 నుంచి జరిగిన ఎన్నికల్లో 1971లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి తరఫున మల్లికార్జున్ గెలిచారు. ఆ తర్వాత ఆయనే కాంగ్రెసు తరఫున గెలిచారు. 1984లో ఎన్టీ రామారావు తెలుగుదేశం హవాలో ఆ పార్టీ గెలిచింది. 1999లో బిజెపి తరఫున పోటీ చేసి నరేంద్ర గెలిచారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఆయనే తెరాస తరఫున గెలిచారు. ప్రస్తుతం విజయశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications