బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ రాష్ట్రాలకు భారీ వర్షసూచన: బంగ్లాదేశ్ పైనా
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సందడి మందగించింది. వాటి రాక ఆలస్యం కావడం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఇప్పటికే దీని ప్రభావం పడింది కూడా. 315 జిల్లాల్లో సగటు కంటే 43 శాతం లోటు వర్షం కురిసింది. జూలై 2వ తేదీ నాటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం.. ఎల్ నినో.
ఈ పరిస్థితుల మధ్య ఐఎండీ తీపి కబురు వినిపించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 16 అంటే.. గురువారం నుంచీ దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ అల్పపీడనం వల్ల కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్ ప్రాంత జిల్లా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు ఉరుములతో కూడిన జల్లులు ఏకధాటిగా పడే వీలుంది. 16, 17 తేదీల్లో వర్షపాత తీవ్రత అత్యధికంగా ఉంటుందని కోల్‌కతాలోని ఐఎండీ రీజినల్ సెంటర్ అంచనా వేసింది. ఈ రెండు రోజుల వ్యవధిలో కోల్ కతలోని కొన్ని ప్రాంతాలలో ఏడు నుండి 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం కురుస్తుంది.
ఈదురు గాలులు వీయడం, పిడుగులు పడటం వంటి విపరీత వాతావరణ మార్పులు సంభవించవచ్చు. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన గాలుల నేపథ్యంలో కోల్‌కతా ప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఉరుములు పడే సమయంలో బయట తిరగవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.
ఈ అల్పపీడన ప్రభావంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఒడిశాలోని తీరప్రాంత, ఉత్తర జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కటక్, ఖోర్ధా, కేంద్రపాడా, భద్రక్, జగత్‌సింగ్‌పూర్, కియోంఝర్, మయూర్‌భంజ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వీటితో పాటు గజపతి, గంజాం, నయాగఢ్, బాలాసోర్, సుందర్‌గఢ్ జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
జూలై 17 వరకు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో, పూరీలో ప్రతిష్టాత్మకంగా జరిగే జగన్నాథుని రథయాత్రపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఒడిశాను ఆనుకుని ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడపాదడపా వర్షాలు పడొచ్చు. అక్కడకక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటం వల్ల బంగ్లాదేశ్ పైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ దేశ దక్షిణం, తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications