ఢిల్లీకి బాబు, లోకసభకు పోటీ: సీమాంధ్రకు బాలయ్య?
హైదరాబాద్: తెలుగుజాతి రెండు విడిపోతున్న స్థితి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తును కూడా మార్చేట్లు ఉంది. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో వాటిలో ఏదో ఒకదానికి పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని అంటున్నారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఏర్పడితే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు కూడా అదే మాట అన్నారు. చంద్రబాబు ప్రధాని అవుతారని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయాల పట్ల చాలా కాలంగా చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం వదులుకున్నానని చంద్రబాబు స్వయంగా ఒకటి రెండు సార్లు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన కచ్చితంగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన బిజెపి, కాంగ్రెసేతర తృతీయ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. తృతీయ కూటమిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఆయనకు రావచ్చు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి ఆయన వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు వల్ల లభించే క్రెడిట్‌తో కాంగ్రెసు ఊపందుకునే స్థితిలో దాని సత్తాను నిలువరించడానికి ఆయన తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన తనకు అత్యంత అనుకూలంగా ఉండే మల్కాజిగిరి లోకసభ సీటును ఎన్నుకుంటారని అంటున్నారు. డిలీమిలిటేషన్ కమిషన్ సిఫార్సు మేరకు ఈ నియోజకవర్గం 2008లో కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, మల్కాజిగిరిలో మేడ్చేల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభా స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వివిధ కారణాల వల్ల తెలుగుదేశం అంతగా సత్తా చాటలేకపోయింది. కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి తగిన బలం ఉంది. నిజానికి, ఈ నియోజకవర్గాల్లో చాలా మంది తెలంగాణేతరులున్నారు. ఆ కారణంగానే కూకట్‌పల్లి నియోజకవర్గంలో లోకసత్తా నుంచి పోటీ చేసిన జయప్రకాష్ నారాయణ గెలిచారు. బహుశా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తు వల్ల కూడా ఆ పార్టీ ఈ స్థానాల్లో చాలా వాటిని కోల్పోయి ఉంటుంది. అందువల్ల ఈ మల్కాజిగిరి లోకసభ స్థానం చంద్రబాబుకు అత్యంత సురక్షితమైందని భావిస్తున్నారు.
కాగా, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సీమాంధ్రపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పుంజుకుంది. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీంతో సీమాంధ్రలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. దీంతో బాలకృష్ణను సీమాంధ్రకు పరిమితం చేసి, వచ్చే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసుకు దీటుగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications