తెలంగాణపై సోనియా గాంధీ వెనక్కి తగ్గుతారా?
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర ఉద్యమం, పార్టీ సీమాంధ్ర నాయకుల ఒత్తిడి కారణంగా తెలంగాణపై తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక్కి తగ్గుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పార్టీ అత్యున్నత స్థాయి సంస్థ సిడబ్ల్యుసి నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడతారా అనేది ప్రశ్న. తెలంగాణ ప్రక్రియ కొనసాగింపుపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ ఇంకా అనుమానాలు వీడడం లేదు. సీమాంధ్ర కాంగ్రెసు నాయకుల ప్రకటనలు కూడా ఆ అనుమానాలు పెరగడానికి కారమమవుతున్నాయి.
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం అంచనా వేసినదాని కన్నా ఎక్కువగా ఉందనేది నిజం. అదే సమయంలో తమ నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు పూర్తిగా కట్టుబడి ఉంటారని కాంగ్రెసు అధిష్టానం అనుకోవడంలో కూడా కాస్తా పొరపాటు జరిగినట్లు ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునే వరకు కాంగ్రెసు అధిష్టానం అడుగడుగు ముందుకు వేస్తూ వెళ్లింది.

జగన్ కారణమా..
మొదట్లో కాస్తా పరిస్థితి సజావుగానే ఉన్నట్లు కనిపించినా జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్కసారిగా తెలంగాణ వ్యతిరేక వ్యూహాన్ని ఎంచుకోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా విభజన నిర్ణయంపై కాస్తా మౌనంగానే ఉన్నారు. కానీ, తెలంగాణను వదులుకోవడానికి సిద్ధపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో బలం పుంజుకోవడానికి వేసిన ఎత్తుగడతో ఆ రెండు పార్టీల నాయకులు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో పోటీ పడి, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమైక్యవాదాన్ని భుజానికి ఎత్తుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. సహజంగానే అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ నేతలపై భారం ఎక్కువగా పడింది. దీంతో కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించే స్థాయిలో కాకున్నా ప్రశ్నించే స్థాయిలో వారు సమైక్యవాదాన్ని వినిపించాల్సిన పరిస్థితిలో పడ్డారు.
చంద్రబాబును నెట్టిన జగన్..
విభజనను అయిష్టంగానే అయినా చంద్రబాబు అంగీకరించడానికి సిద్ధపడ్డారు. కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు సమైక్యవాదంతో దూకుడు ప్రదర్శించడంతో చంద్రబాబు కూడా మాట్లాడాల్సిన పరిస్థితిలో పడ్డారు. కాంగ్రెసు వైఖరిని తప్పుపడుతూ ఆయన సుదీర్ఘంగా మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే, ఆయనపై వెంటనే విమర్శల జడివాన మొదలైంది. సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్న స్థితిలో వైయస్ జగన్ వేసిన వలలో ఆయన చిక్కుకున్నారనే మాట వినిపిస్తోంది.
చివరకు, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిన బిజెపి నాయకులు వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్ కూడా కాంగ్రెసు తీరును తప్పుపట్టారు. విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరించిన తీరును వారు తప్పు పట్టారు. సొంత పార్టీ నాయకులనే ఒప్పించలేకపోయిందనే విమర్శను కాంగ్రెసు అధిష్టానం ఎదుర్కుంది. ఈ స్థితిలో సోనియా గాంధీ ఆంటోనీ కమిటీని నియమించింది.
ఆంటోనీ కమిటీ ఎందుకు..
విభజన నిర్ణయంపై సోనియా గాంధీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని తెలిసిన కేంద్ర మంత్రులు చిరంజీవిలాంటి వారు ప్యాకేజీల ప్రయత్నాలను ప్రారంభించారు. తీవ్రమైన ఆందోళనకు గురైన సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పడానికి మాత్రమే ఆంటోనీ కమిటీ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, ప్రస్తుత ఆందోళనల కారణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరిగిందనేది మాత్రం నిజం. ఈ పార్లమెంట సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని కాంగ్రెసు అధిష్టానం మొదట భావించింది. అయితే, తమ పార్టీ సీమాంధ్ర నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకతను, సీమాంధ్రలో పెల్లుబుకిన సమైక్య ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని కాస్తా వెనక్కి తగ్గింది.
వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ సెప్టెంబర్ నెలలో కూడా పనిచేసే అవకాశం ఉంది. మరోసారి సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పి విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లాలనే వ్యూహంతో కాంగ్రెసు అధిష్టానం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
వెనక్కి తీసుకుంటే ఎలా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఈ స్థితిలో వెనక్కి తీసుకుంటే సంభవించే పరిణామాలు సోనియా గాంధీకి తెలుసు. అధిష్టానం పెద్దలకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితే వస్తే తెలంగాణలో లేచిపడే ఆందోళనల మాట అటుంచితే, మొత్తంగానే సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీ విశ్వసనీయత ప్రమాదంలో పడుతుంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సోనియా గాంధీ విశ్వసనీయత దెబ్బ తింటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే కాంగ్రెసుపై ప్రజల్లో నమ్మకం లేదు. ఇప్పటికి కూడా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే విధంగా కాంగ్రెసు వ్యవహరిస్తుందా, తనంత తానుగా బిల్లు ఆమోదం పొందకుండా చూసే వ్యూహాన్ని అనుసరిస్తుందా అనే అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెసు అధిష్టానం ఈ స్థితిలో తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలుండవు. ఈ విషయాన్ని రాయలసీమ పరిరక్షణ హక్కుల సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంటివారే కాదు, సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు కూడా పరోక్షంగా చెబుతున్నారు.
నరేంద్ర మోడీ సవాల్..
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బిజెపి రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెసు పార్టీకి సవాల్‌గా మారారు. తెలంగాణలో ఇప్పటికే పుంజుకున్న బిజెపి మోడీ ఇమేజ్‌తో మరింత బలాన్ని సంతరించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెసు విశ్వసనీయతపై, నిజాయితీపై ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బిజెపికి అనాసయంగా అవకాశం అందినట్లే అవుతుంది.
విభజనపై లోపలి మాటలు..
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సిపిఐ కార్యదర్శి నారాయణ ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకుంటే మాత్రమే విభజన ప్రక్రియ వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. వారు ముగ్గురు లేఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు లేఖలు ఇస్తే సమైక్యాంధ్ర కోసం తాము అధిష్టానంతో పోరాటం చేస్తామని రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ వంటి నాయకులు అంటున్నారు. ఇంతకు ముందు ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాటను ఎవరూ నమ్మడం లేదు.
వైయస్ జగన్ సమైక్య ఉద్యమానికి ఊతం ఇవ్వడం వల్ల సీమాంధ్రకు నష్టం జరిగే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అదే మాట అంటున్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి అవసరమైన ప్యాకేజీలపై, నదీ జలాలపై, ఇతర అంశాలపై బేరసారాలు సాగించలేని పరిస్థితిని కల్పించారనే మాట వినిపిస్తోంది. ఏమైనా, సోనియా గాంధీ తెలంగాణ నిర్ణయంపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఎన్నికల లోపు ఏర్పడకుండా అటకాయించే పరిస్థితి ఉందా, ఆ పరిస్థితిని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు కల్పిస్తారా అనేది మాత్రమే అనుమానం. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుండా ఎన్నికల్లోకి దిగితే కాంగ్రెసు అధిష్టానం ఇప్పటి వరకు చేసిన కసరత్తు అంతా వృధా అవుతుందనేది విశ్లేషకుల అంచనా.












Click it and Unblock the Notifications