యుటిగా అంగీకరించం: దానం, టీ నేతల భరోసా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం తీసుకునే ఏ విధమైన నిర్ణాయనికైనా తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ తర్వాత వారు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఆంగీకరించబోమని మంత్రి దానం నాగేందర్ చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందున అది తప్ప మిగతా అంశాలపై చర్చిస్తే మంచిదని తెలంగాణ నాయకులు సూచించారు. సమస్యల పరిష్కారానికి అభిప్రాయాలను వెల్లడించాలని బొత్స చెప్పారు.

ముందుగా సీమాంధ్ర నేతల అభ్యంతరాలేంటో తెలిస్తే వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇవ్వగలుగుతామని కొందరు నేతలు బొత్సతో అన్నారు. తమకు చెప్పకుండా విభజన ప్రకటన చేశారని ముఖ్యనేతలు అనడంలో అర్థం లేదని వివరించారు. విభజన విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి సహా ముఖ్యనేతలంతా బాహాటంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వారే సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
అయితే ఈ నెల 19న ఆంటోనీ కమిటీని కలుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అనడంతో అదే రోజు రాత్రి 8 గంటలకు ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యేందుకు బొత్స సమయం కేటాయించారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానికి, శాంతి భద్రతలు కేంద్ర పర్యవేక్షణలో ఉండేందుకు తాము అంగీకరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ విషయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని వివరించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు మాత్రమే అంగీకరిస్తామని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకొనేది లేదని మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆంటోని కమిటీకి వారి అనుమానాలు, ఇబ్బందులు తెలియజేస్తున్నారని, తాము కూడా కమిటీని కలిసి అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా, ఆంటోనీ కమిటీని గ్రేటర్ మంత్రులం ప్రత్యేకంగా కలుస్తామని, అందుకు మరో రోజు సమయం కేటాయించాలని బొత్సను కోరినట్లు దానం నాగేందర్ తెలిపారు.












Click it and Unblock the Notifications