వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీ లేదన్న టీ నేతలు: సీమాంధ్ర నేతల అల్టిమేటం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై హస్తిన వేడెక్కింది. కాంగ్రెసు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు సోమవారం రాత్రి ఎకె ఆంటోనీ కమిటీని కలిశారు. కాంగ్రెసు వార్ రూమ్‌లో ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ విషయంలో రాజీ లేదని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీకి తెలిపినట్లు సమాచారం. అయితే, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రతిపాదన ఏదీ చర్చకు రాలేదని సమావేశానంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మీడియాతో చెప్పారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తుండగా, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి, శాంతిభద్రతల నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉంటే తమకు అభ్యంతరం లేదని తెలంగాణ నేతలు ఇప్పటికే చెప్పారు. దానికి మించి మరో ప్రతిపాదన వద్దని వారు సూచించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు తాము ధన్యవాదాలు తెలిపినట్లు మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, జాప్యం చేస్తే ఫలితం ఉండదని చెప్పినట్లు ఆయన వివరించారు.

Telangana

భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉంటుందని, జిల్లాల సరిహద్దుల మార్పు ఉంటుందని అధిష్టానం ఏమీ చెప్పలేదని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామనే అధిష్టానం చెప్పిందని ఆయన అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇవ్వాలని తాము కోరామని, ఆ మేరకే కాంగ్రెసు అదిష్టానం కూడా నిర్ణయం తీసుకుందని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

విభజన ప్రక్రియ కొనసాగుతుంది: దిగ్విజయ్

విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి తాము మూడు ప్రాంతాల నాయకులతో చర్చిస్తున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విభజన ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలంగాణ నేతలతో సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కమిటీ హైదరాబాదు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడికి ఆహ్వానించామని ఆయన అన్నారు. రేపు కూడా సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆంటోనీ కమిటీతో చెప్పారు.

తెలంగాణలోని సీమాంధ్రులు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి గీతారెడ్డి అన్నారు. సీమాంధ్రవారిని తమ బంధువుల్లాగానే చూస్తామని ఆమె అన్నారు. సీమాంధ్ర నేతలతో మాట్లాడాలని ఆంటోనీ కమిటీ తమకు సూచించినట్లు ఆయన తెలిపారు. సిడబ్ల్యుసి తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరినట్లు ఆమె చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించే ప్రసక్తి లేదని గీతారెడ్డి చెప్పారు. జలవనరుల పంపకంపై కేంద్రం కమిటీ వేస్తే అభ్యంతరం లేదని చెప్పినట్లు ఆమె చెప్పారు. సిడబ్ల్యుసి తీర్మానాన్ని తుచ తప్పకుండా అమలు చేయాలని కోరినట్లు మరో మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

రాజీనామాలు చేస్తాం: సీమాంధ్ర నేతలు

ఇదిలావుంటే, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు సోమవారం సమావేశమై రేపు మంగళవారం ఆంటోనీ కమిటీ ముందు చెప్పాల్సిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజనను అంగీకరించేది లేదని, సిడబ్య్లుసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాలని వారు నిర్ణయించుకున్నారు.

ఆంటోనీ కమిటీ ముందు నాలుగు డిమాండ్లు ఉంచాలని, వాటిని ఆమోదించకపోతే రాజీనామాలు చేస్తామని చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు. సమావేశానంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన అనివార్యమైతే రెండు రాష్ట్రాలకు రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, తమ డిమాండ్లను ఆగస్టు 30వ తేదీలోగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేయనున్నారు.

తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో ఈ నెల 30వ తేదీ తర్వాత తాము రాజీనామాలు చేస్తామని చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా నష్టపోతుందని వారు ఆంటోనీ కమిటీకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 30వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున తాము నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి రాజీనామాలు చేస్తే తప్ప సాధ్యం కాదని వారు చెప్పబోతున్నారు.

కాగా, ఆహార భద్రత బిల్లుపై పార్లమెంటులో ఎలా వ్యవహరించాలనే విషయంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. తిరిగి రేపు మంగళవారం సమావేశం కావానలి నిర్ణయించుకున్నారు.

దిగ్విజయ్ సింగ్‌తో విజయశాంతి భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెన్షన్‌కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఆమెతో పాటు తెరాస నుంచి సస్పెండ్ అయిన మెదక్ జిల్లాకే చెందిన రఘునందనరావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. వీరిద్దరు కాంగ్రెసులో చేరే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

English summary
Congress Telangana leaders urged to AK Antony committee to complete Telangana process as early as possible. Meanwhile, seemandhra leaders decided to give ultimatum to Congress high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X