టీ గౌడ్‌కు ఆంధ్ర ఉద్యోగిని రాఖీ: శాంతి దీక్ష (ఫోటోలు)
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి ఇరు ప్రాంతాల మధ్య కాస్తా సామరస్యపూరిత వాతావరణాన్ని కల్పించినట్లే ఉంది. ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద బుధవారం శాంతి దీక్ష జరిగింది. దీక్షలైనా, ఆందోళనలైనా అంతటా రాఖీ పౌర్ణమి వాతావరణం కనిపించింది.
విద్యుత్ సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం కూడా పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. ఇరు ప్రాంతాల ఉద్యోగుల నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. భారీగా పోలీసులను మోహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ మహిళా ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు రాఖీలు కట్టారు.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును ఇచ్చారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఛైర్మన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును సీఎస్‌కు ఇచ్చారు.

శ్రీనివాస గౌడ్‌కు ఆంధ్ర ఉద్యోగిని రాఖీ
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్‌కు ఆంధ్ర ఉద్యోగిని రాఖీ కట్టి తన సోదర భావాన్ని ప్రకటించారు. హైదరాబాదులోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ఈ దృశ్యం ఆసక్తిని కలిగించింది.

ఆంధ్ర ఉద్యోగులకు రోజా పువ్వు
తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్ ఆంధ్ర ఉద్యోగుల పట్ల అదే సోదర భావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆయన గులాబీ పువ్వును ఇచ్చి సామరస్య వాతావరణానికి సూచన చేశారు. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉందామని తెలంగాణ వాదులు చెబుతున్నారు.

శాంతిదీక్షలో కోదండరామ్
ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని, సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జెఎసి హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్ష చేపట్టారు. దీక్షలో ఉన్న తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు ఆ బాలిక రాఖీ కట్టింది.

సచివాలయంలో సీమాంధ్ర సెగ
రాష్ట్ర సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు ప్రదర్శన నిర్వహించారు. మూడు ప్రాంతాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ వారు ఆందోళనకు దిగారు.

రాయలసీమ జెఎసి
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ జెఎసి తెర మీదికి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని వారు కోరారు. రాయలసీమ రాజకీయ నాయకులు ఆంధ్ర నాయకులతో కలిసి పనిచేయడం మాని, రాయలసీమ హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని జెఎసి ఉపాధ్యక్షుడు భూమన్ మీడియా సమావేశంలో కోరారు.

విద్యుత్ సౌధలో ఆందోళన
ఎప్పటిలాగే విద్యుత్ సౌధలో మింట్ కాంపౌండులోనూ విద్యుత్ సౌధలోను తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. సీమాంధ్ర మహిళా ఉద్యోగులు పోలీసులకు రాఖీ కట్టి తమ సోదరభావాన్ని ప్రదర్శించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తాము నిరవధిక సమ్మెకు దిగుతామని వారు చెప్పారు. ప్రభుత్వం ఉద్యమం అణచివేతకు దిగితే మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఎస్మాకి కూడా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు.
రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదని రాయలసీమ జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమలో రాజధాని ఏర్పాటు చేయాలని, లేదంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం సీమను విడదీయాలని చూస్తే నేతల అంతు చూస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications