రాజ్యసభ సభ్యత్వానికి రేపు హరికృష్ణ రాజీనామా?

నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న సోదరుడు నందమూరి బాలకృష్ణతో కూడా హరికృష్ణ తీవ్రంగా విభేదిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆయన, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో కూతురు తేజస్విని వివాహానికి కూడా హాజరు కాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌కు వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అందిందా, లేదా అనేది కూడా అనుమానమేనని అంటున్నారు.
కాగా, తెలంగాణ అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తొలుత స్వాగతించిన హరికృష్ణ ఆ తర్వాత తీవ్రంగా వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. సమైక్యాంధ్ర నినాదంతో హరికృష్ణ సీమాంధ్రలో చైతన్య యాత్ర చేపడుతారని అంటున్నారు. హిందూపురం నుంచి ఆయన తన యాత్రను ప్రారంభిస్తారని చెబుతున్నారు. త్వరలోనే ఈ యాత్రను ఆయన చేపట్టే అవకాశాలున్నాయి.
తన తండ్రి ఎన్టీ రామారావు వాడిన చైతన్య రథాన్ని హరికృష్ణ తన యాత్రకు వాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తన పర్యటనలో చంద్రబాబు తీరుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, హరికృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు కాంగ్రెసు వ్యతిరేక విధానం అవలంభిస్తున్నట్లు చెబుతూ ఆయన బిజెపికి అనుకూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఆయన తన మీడియా లేఖను బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి మీడియా సంస్థలకు ఫాక్స్ చేశారు.
కాగా, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి ఈ నెల 25వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపడుతారని అంటున్నారు. వారం రోజుల పాటు ఆయన శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు యాత్ర ప్రారంభానికి ముందే హరికృష్ణ తన చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పర్యటిస్తారా, లేదా అనేది తెలియదు.












Click it and Unblock the Notifications