జలసౌధ వద్ద తీవ్రఉద్రిక్తత: హరి, బిజెపిపై హరీష్ ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జల సౌధ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతత ఏర్పడింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ కోసం ఆ ప్రాంత ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తూ, పోటా పోటీగా నినాదాలు చేశారు. ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య ఓ సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు ప్రాంత ఉద్యోగులను నియంత్రించే ప్రయత్నాలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తులసి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

తులసిరెడ్డి అరెస్టు
జలసౌధ వద్ద అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేత తులసి రెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. మొదట ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు తరలించారు. తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, అక్కడే ఉంచారు.

తెలంగాణ ఉద్యోగుల నినాదాలు
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనతో హైదరాబాద్‌లో జలసౌధ జలసౌధ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఉద్యోగులు జై తెలంగాణ బ్యానర్లతో నినాదాలు చేస్తూ కనిపించారు.

జై సమైక్యాంధ్ర నినాదాలు
సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర బ్యానర్లతో వారు ఆందోళనకు దిగారు. దీందో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అదుపులోకి కొంత మంది
ఉద్రిక్తతలను నివారించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రయత్నం
సీమాంధ్ర ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు తులసీరెడ్డి జలసౌధకు వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు.
నిరంకుశమే: కోదండ
బలవంతంగా కలిసుండాలని సీమాంధ్రులు డిమాండ్ చేయడం నిరంకుశమే అవుతుందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. ఆయన ఇందిరా పార్కు శాంతిదీక్షలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై తన వైఖరి మార్చుకోకుంటే సహాయ నిరాకరణ చేస్తామన్నారు. తెలంగాణపై తీసుకున్నది తొందరపాటు నిర్ణయం కాదని, ఆలస్యమైందన్నారు.
బిజెపి, హరికృష్ణపై హరీష్ నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు టిడిపి నేత హరికృష్ణ, బిజెపి పార్టీల పైన మండిపడ్డారు. నిన్నటి వరకు బిజెపి తెలంగాణపై స్పష్టంగా ఉందని భావించామని, నిన్నటి ఘటనతో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. గతంలో తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడని బిజెపి ఇప్పుడెలా మాట్లాడుతుందని ప్రశ్నించారు.
హరికృష్ణ సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన బతికున్నప్పుడు చెప్పులు వేయించిన హరికి ఆయన పేరు చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు. సీమాంధ్ర ప్రజలను రోడ్ల పైకి తీసుకు వస్తున్న నేతలు తమ వ్యాపారాలను మాత్రం ఎందుకు ఆపడం లేదన్నరు. కమిటీలతో తెలంగాణ ప్రజల జీవితాలతో కాంగ్రెసు ఆడుకుంటోందన్నారు.












Click it and Unblock the Notifications