వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మకు రెడ్ కార్పెట్, మాకేమో: పిఎంకు బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన ప్రధాని మన్మోహన్ సింగ్ తమ పార్టీ నాయకులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులను నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు.

రాష్ట్ర పరిస్థితిపై కాంగ్రెసును తప్పు పడుతూ ఆయన ప్రధానికి ఆ లేఖాస్త్రం సంధించారు. కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే స్థాయిలో సమస్య తీవ్ర రూపం దాల్చితే దాన్ని పరిష్కరించాలన్న ఇంగితం లేకపోవడమేమిటని ఆయన అడిగారు. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, సమ్మెలు, ఉద్యమాలతో ప్రజా జీవనం నెల రోజులుగా స్తంభించిపోయిందని, ఉద్యోగులు పరస్పరం బహిరంగంగా కలహించుకుంటున్నారని ఆయన చెప్పారు.

"దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ తగలబడుతుంటే మౌన మునిలా కూర్చోవడమేనా మీ పని? అవసరమైతే హైదరాబాద్ వచ్చి కూర్చుని అందరితో మాట్లాడి పరిస్థితిని ఉపశమింపజేయాల్సిన బాధ్యత మీకు లేదా? కాంగ్రెస్ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి సహకరించిన ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా'' అని ధ్వజమెత్తారు.

2009లో యూపీఏ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు చెలరేగి బలిదానాలు చోటు చేసుకొని నాలుగేళ్లపాటు రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి స్తంభించిపోయాయని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో తిరుగుబాటుతో రాష్ట్రంలో కల్లోలం చెలరేగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పతనమైంది...

"మీరు ప్రధాని హోదాలో మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు అమెరికాలోని నగరాలతో పోటీపడగలిగే నగరం హైదరాబాద్ మాకూ ఉందని గొప్పగా చెప్పుకొన్నారు. అంత వెలుగు వెలిగిన నగరం నా కళ్లముందే పతనం అయింది. రాజకీయ అస్థిరత, గొడవలు, ఆర్థిక పతనం, ప్రజల మధ్య తగాదాలతో హైదరాబాద్ క్షీణించిన తీరు నా హృదయాన్ని గాయపరుస్తోంది. దీనిని చక్కదిద్దకపోగా కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మరింతగా సంక్షోభంలోకి నెడుతూ వస్తోంది. ఆందోళన చేస్తున్న వర్గాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి కూర్చున్నాయి'' అని ఆయన ఆరోపించారు.

ఇంత సున్నిత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ప్రజలను నిశ్చేష్టులను చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే.. 'దీని వల్ల టీఆర్ఎస్ మా పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉంద'ని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సిగ్గు లేకుండా చెబుకున్నారని, అదే రోజు రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత దాన్ని ద్రువీకరించారని ఆయన అన్నారు.

ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెస్ పార్టీ చెట్టాపట్టాలు ప్రారంభమయ్యాయని, విభజన నిర్ణయం గురించి వైయస్సార్ కాంగ్రెసు ముందే సమాచారం ఇచ్చారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆడారని, వైఎస్ విజయలక్ష్మి ఢిల్లీ రాగానే మీరు ఆమెకు రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలికారని, అడిగిన వెంటనే క్షణాల్లో అపాయింట్‌మెంట్లు ఇచ్చేశారని ఆయన అన్నారు.

కొత్త క్విడ్ ప్రోకో ప్రారంభం...

తాము అడిగితే మాత్రం ప్రధానికి సమయం దొరకలేదని, జగన్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఇప్పుడు కొత్త క్విడ్ ప్రో కో మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిలో భాగంగా సిబిఐ, ఈడీల దర్యాప్తును వేగం తగ్గించి మమ అనిపించి జగన్‌కు త్వరగా బెయిల్ ఇప్పించే వ్యవహారం నడుస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి బదులుగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి జగన్ సన్నద్ధమవుతున్నాడని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో అనేక రోజులపాటు ఆందోళన చేసినా వారిని ఒక్కసారి కూడా పిలిపించి మాట్లాడే ఓపికను ప్రధాని ప్రదర్శించలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో చెలరేగిన ఆందోళనలపై ఒక రాజనీతిజ్ఞుని మాదిరిగా ప్రధాని వ్యవహరిస్తారనుకొంటే ఆయన కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మ మాదిరిగా వ్యవహరించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ ఎన్జీవో నేతలు వచ్చి తనను కలిస్తే వెళ్లి ఆంటోనీ కమిటీని కలవమని ప్రధాని చెబుతున్నారని, ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకొంటున్నారా? ఆంటోనీ కమిటీ ఒక పార్టీ కమిటీ అని, బయటివారు వెళ్లి దాన్ని ఎలా కలుస్తారని చంద్రబాబు అన్నారు.

"ఆంధ్రప్రదేశ్‌లో రగిలిన చిచ్చుకు కారణం మీరు కాదా? దాన్ని పరిష్కరించే బాధ్యత మీకు లేదా? మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అత్యవసర ప్రాధాన్యంతో దీన్ని పరిష్కరించాలన్న ఇంగితం మీకు కలగకపోవడం ఏమిటి? దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన రాష్ట్రానికి మీరిచ్చే బహుమతి ఇదేనా'' అని చంద్రబాబు ప్రధానిని ప్రశ్నించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu has lashed out at PM Manmohan singh on situation prevailed in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X