లేఖ ఇచ్చాం, టి ఎప్పుడొచ్చింది: చంద్రబాబు సూటి ప్రశ్న
గుంటూరు: తెలంగాణ సెంటిమెంటును గుర్తించి తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేఖ ఇచ్చిందని, అసలు తెలంగాణ విషయం ఎప్పుడు వచ్చిందో ప్రజలు ఓసారి ఆలోచించాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లా పొందుగుల నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ విషయం ఎప్పుడు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాము గెలువలేమని భావించిన నాటి ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఆజ్యం పోశారన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, కాంగ్రెసు పార్టీ ఎపి వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఈ విషయం చెప్పారన్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ఇరు ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉండగా తాను సమైక్యంగా ఉండాలని స్పష్టంగా చెప్పానన్నారు. కానీ, 1999లో వైయస్ ఆజ్యం పోస్తే, 2004లో తెరాసతో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తాము తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. వైయస్ బీజం వేస్తే కాంగ్రెసు ఆజ్యం పోసిందన్నారు.
తాము కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పారు. టిడిపి హయాంలో ఇరు ప్రాంతాల ప్రజలు రామలక్ష్మణుల్లా ఉంటే, కాంగ్రెసు హయాంలో వాలి, సుగ్రీవుల్లా కొట్టుకునేలా చేసిందన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసి, సంపదను సృష్టించి, ఉద్యోగాలు కల్పించింది టిడిపియే అన్నారు. హైదరాబాదును ప్రపంచపటంలో నిలిపింది టిడిపి ప్రభుత్వమే అన్నారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెసు పార్టీ కంకణం పెట్టుకుందన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాను స్పష్టంగా ఆనాడు చెప్పానన్నారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంటును గుర్తించి లేఖ ఇచ్చానని చెప్పారు. తెలుగు జాతి విచ్చిన్న కుట్రలో కాంగ్రెసు ప్రధాన పాత్రదారి అయితే తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో గ్రేట్ జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్‌కు కేసులు మాఫీ, కెసిఆర్‌కు ప్యాకేజీలు కావాలని ఆరోపించారు.
నెల రోజులకు పైగా సీమాంధ్రలో ప్రజలు రోడ్ల పైకి వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల కోసం నాడు ఎన్టీఆర్ సినిమాలు వదిలి పార్టీ పెట్టారని, ఆయనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు ప్రజలతో పెట్టుకోవద్దని కాంగ్రెసు పార్టీని హెచ్చరించారు. తాను సిఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానన్నారు.
రాష్ట్రంలో ఇటీవల మూడు వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు విన్నానన్నారు. కాంగ్రెసు పాలనలో సోనియా అండతో యథేచ్ఛగా రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సమైక్యం వినిపించామన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగ, విద్యార్థి తదితర ఉద్యమకారులతో ఒకటికి పదిసార్లు కేంద్రం మాట్లాడి ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్నారు. లేదంటే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
కాంగ్రెసు పార్టీ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్నారు. మీ బెయిల్, విడుదల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీయే వైయస్సార్ కాంగ్రెసు ముసుగుతో ప్రజల మధ్యకు వస్తుందన్నారు. జగన్‌కు సహకరిస్తే సోనియాకు సహకరించినట్లేనని, ఆమె లక్ష్యం తెలుగు జాతిని సర్వనాశనం చేయడమే అన్నారు.
ప్రధాని కార్యాలయంలో ఫైళ్లు మాయమైతే సమాధానం చెప్పలేని స్థితిలో మన్మోహన్ సింగ్ ఉన్నారన్నారు. ఇలాంటి వ్యక్తి దేశాన్ని కాపాడుతాడా అన్నారు. దేశం అవినీతిలో కుళ్లిపోయిందన్నారు. అందరు కలిసి టిడిపి పైన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టిడిపిపై కుట్ర కోసం తెలుగు ప్రజలపై కసి తీర్చుకుంటున్నారన్నారు. ఎవరు ఓడకుండా అందర్నీ గెలిపించడమే అసలైన విజయమన్నారు.












Click it and Unblock the Notifications