బాబులా దేశంలోనేలేరు, స్టేట్‌మెన్‌వే ఐతే..: హరీష్ సెటైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులా మాటలు మార్చే వారు దేశంలోనే ఎవరు లేరని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం అన్నారు. దేశంలోనే ఆయనన్నిసార్లు మాటలు మార్చివ వారు మరొకరు లేరన్నారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలంగా రాసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
ఓట్ల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట చంద్రబాబు పర్యటించడం తెలంగాణ ప్రజలను వంచించడమే అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు తెలుగు జాతి విచ్ఛిన్నం ఆయనకు గుర్తుకు రాలేదా అన్నారు. అఖిలపక్షంలో రాష్ట్రాన్ని ఇవ్వవచ్చునని చంద్రబాబు చెప్పారని, అప్పుడు ఏమయిందన్నారు.

రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో సీమాంధ్రుల రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లిలు కూడా సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు రోడ్ల పైకి వచ్చినప్పుడు బాబు ఎందుకు యాత్ర చేయలేదని, ఇక్కడి వారు ప్రజలు కాదా అన్నారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల జెఏసిలతో సమావేశం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు.. అందుకోసం ఆయనే చొరవ తీసుకోవాలన్నారు. జెఏసిలు విభజనకు సహకరించాలని కోరారు.
బాబుకు మాట మార్చడం అలవాటుగా మారిందన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన మాట్లాడుతున్నారన్నారు. బాబు నిజమైన స్టేట్‌మెన్ అయితే విభజనకు సహకరించాలని కోరారు. తెలంగాణ టిడిపి నేతలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు.
అడ్డుకుంటాం: టిడిపి ఎంపీలు
సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాము పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్తామని టిడిపి ఎంపీలు ఢిల్లీలో చెప్పారు. సభలను అడ్డుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications