.. సోనియమ్మా: పార్లమెంటు వద్ద శివప్రసాద్ చెక్కభజన
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బుధవారం గేట్ నెంబర్ 1 వద్ద చెక్కభజనతో వినూత్న నిరసన చేపట్టారు. ఎందుకీ పాడు విభజన సోనియమ్మ అంటూ చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ పాట పాడగా, మిగిలిన సభ్యులు కోరస్ ఇచ్చారు.
'ఎందుకీ పాడు విభజన, ఓ సోనియమ్మ, ఎందుకీ పాడు విభజన, ఐదు కోట్ల మంది జనం రోడ్లమీదకు వచ్చినారు, భవిష్యత్ లేదంటూ చిన్నా పెద్దా ఏడ్చినారు అంటూ పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని సభలో కూర్చొకుండా సస్పెండ్ చేశారని, అందుచేత పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు ఇలాగే నిరసన తెలుపుతామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని ప్రాంతాల వారితో చర్చించాలన్నారు. టిడిపి ఎంపీలకు డిఎంకె, అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, బిజెపి పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
సమావేశాలు పొడిగించే అవకాశం
పార్లమెంటు సమావేశాలను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు బిల్లులు పెండింగులో ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు సమావేశాలు పొడిగించాలని చూస్తున్నారు. ఎపి విభజన, బొగ్గు కుంభకోణం.. తదితరాల వల్ల సభలు నిత్యం వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications