ఆ తర్వాతే విలీనం!: కెసిఆర్ నోట మూడో ఫ్రంట్ మాట
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయం గురించి చెబుతానని, అప్పటి వరకు విలీనం జరగదని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. పార్లమెంట్‌లో తనను కలిసిన మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గతవారం ఆంటోనిని మాత్రమే కాక ఎపి కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కూడా కలిశానని చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయమని తాను కోరానని, వారు కూడా తాము ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారని తెలిపారు. అంతకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో కెసిఆర్‌కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగాతా రాయ్‌కి నడుమ మూడో ఫ్రంట్‌పై ఆసక్తికరమైన చర్చ నడిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో ఏదీ అధికారంలోకి రాదని, మూడోఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కెసిఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

పార్లమెంట్ ప్రాంగణంలో కెసిఆర్, సౌగాతా రాయ్‌లు కొద్దిసేపు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తమకు వచ్చే ఎన్నికల్లో 30 లోక్‌సభ సీట్లకు పైగా వస్తాయని సౌగాతా రాయ్ కెసిఆర్‌కు చెప్పారు. తాము బిజెపితో చేతులు కలిపే ప్రసక్తి లేదని, బెంగాల్‌లో 27 శాతం ముస్లింలు ఉన్నారని రాయ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోఫ్రంట్ సర్కార్ ఏర్పడే అవకాశం ఉందని, తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నామని సౌగాతా రాయ్ వివరించారు.
తాను కూడా జెడి(యు) నేత నితీష్ కుమార్, బిఎస్పీ అధినేత్రి మాయావతితోపాటు పలుపార్టీల నేతలతో మాట్లాడానని, అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితికి 12 సీట్లకు పైగా వస్తాయని చెప్పాయని, తెలంగాణలో తామే నంబర్ వన్‌గా నిలుస్తామని చెప్పుకొచ్చారు. మూడో ఫ్రంట్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో 300 సీట్లకు పైగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications