టీలేఖ వెనక్కి తీసుకోకుండా యాత్రనా: బాబుపై షర్మిల
హైదరాబాద్: తెలంగాణ అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఎలా యాత్ర చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బుధవారం ఆమె అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. కదిరిలో మాట్లాడుతూ ఆమె రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానాన్ని తప్పు పట్టారు.
అవిశ్వాస తీర్మానం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడారని ఆమె అన్నారు. సమన్యాయం చేయలేని కాంగ్రెసు అధిష్టానానికి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎక్కడదని ఆమె అడిగారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రానికి అన్యాయం చేయడానికి కాంగ్రెసు పార్టీ పూనుకుందని ఆమె విమర్శించారు.

రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమలో ఒక్క పంటకు కూడా నీరు రాదని, నీరందకపోతే గడపగడపకు ఆత్మహత్యలు జరుగుతాయని షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగాల కోసం సీమాంధ్ర యువకులు ఎక్కడికి వెళ్లాలని ఆమె అడిగారు. కాంగ్రెసు తన రాజకీయ కోసం సీమాంధ్రను వల్లకాడుగా మారుస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన సంకేతాలు రాగానే తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆమె అన్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ షర్మిల తిరుపతి నుంచి తన సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications